Life Style
Lifestyle: ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీ బాధిఉతుల పెరుగుతున్నారు. వీటికి తోడు మానసిక సమస్యలు పెరగడం, ఒత్తిడితో కూడిన జీవన విధానం రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. అయితే ఎక్కువ శాతం తీసుకునే ఆహారం కారణంగానే బీపీ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ సమస్య పెరుగుతుందని మనందరికీ తెలిసిందే.
ఉప్పులో ఉండే సోడియం కంటెంట్ కారణంగా రక్త ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడడం కారణంగా అధిక రక్తపోటు వస్తుందని తెలిసిందే. అయితే ఉప్పు మాత్రమే కాదు, చక్కెర ఎక్కువగా తీసుకున్నా బీపీ సమస్య తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటి చక్కెర తింటే బీపీ ఎలా వస్తుందనేగా మీ సందేహం. అయితే స్వీట్ ఎక్కువగా తినే వారిలో బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా ఒక రకమైన కొవ్వు. అందుకే అధిక మొత్తం చక్కెర ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హైబీపీ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అప్పటికే బీపీ సమస్యతో బాధ పడుతున్నవారు స్వీట్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియంల సహజ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ కారణంగా శరీరంలో కేలరీలు అధికంగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని, దీర్ఘకాలంలో ఇది ఇతర వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.