Business
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
FD Rates: ఈ మే నెలలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposits) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్‌బీఎల్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. గరిష్ఠంగా 9.10 శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి? రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే ఎందులో ఎక్కువస్తుంది? ఓసారి తెలుసుకుందాం.
డీసీబీ బ్యాంక్..
రూ. 2 కోట్ల లోపు ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇటీవలే సవరించిన డీసీబీ బ్యాంక్. కొత్త రేట్లను మే 22, 2024వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చింది. 19 నెలల నుంచి 20 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 8 శాతం వడ్డీ ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు 8.55 శాతం మేర వడ్డీ అందిస్తోంది. రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే జనరల్ కస్టమర్లకు 20 నెలల తర్వాత వడ్డీ రూ. 12,800 వరకు లభిస్తుంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్..
రూ.2 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లను మే 15, 2024వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చింది ఈ బ్యాంక్. 500 రోజుల టెన్యూర్ స్కీమ్ పై గరిష్ఠంగా 8 శాతం జనరల్ కస్టమర్లకు వడ్డీ ఇస్తుండగా.. సీనియర్లకు 8.40 శాతం ఆఫర్ చేస్తోంది. జనరల్ కస్టమర్ రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి వడ్డీ రూ. 11000 వరకు లభిస్తుంది
ఎస్‌బీఐ..
రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొత్త రేట్లను మే 15, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సవరించిన వడ్డీ రేట్లు మే 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. జనరల్ కస్టమర్లకు 4-8.50 శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లకు పైగా వడ్డీ ఇస్తోంది. దీంతో 2-3 ఏళ్ల టెన్యూర్ పై 9.10 శాతం మేర వడ్డీ అందిస్తోంది. 3 ఏళ్ల టెన్యూర్ పై సీనియర్ సిటిజన్ రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూ. 26,700 వరకు లభిస్తుంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్..
ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించి మే 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 18-24 నెలల టెన్యూర్ పై జనరల్ కస్టమర్లకు 8 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ ఇస్తోంది. దీని ప్రకారం జనరల్ కస్టమర్ రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే 24 నెలల తర్వాత వడ్డీ రూ.15,450 వరకు లభిస్తుంది
సిటీ యూనియన్ బ్యాంక్..
ఈ బ్యాంకులో సవరించిన వడ్డీ రేట్లు మే 6వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ పై గరిష్ఠంగా 7.25 శాతం జనరల్ కస్టమర్లకు, 7.75 శాతం సీనియర్లకు వడ్డీ రేట్లు కల్పిస్తోంది. ఒక జనరల్ కస్టమర్ 400 రోజుల టెన్యూర్ పై రూ.1 లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి వడ్డీ రూ. 7,900 పైన లభిస్తుంది