International
రష్యాలో ఉగ్రవాదుల నరమేధం.. చర్చిలు, ప్రార్థనా మందిరాలపై దాడి.. 15మందికిపైగా మృతి
Terrorist attack in Russia : రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్‌కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15మందికిపైగా మరణించారు. రష్యన్ గార్డ్స్‌లోని బీటీఆర్-80 స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకిదిగి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఉగ్రదాడిపై డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. డెర్బెంట్ లోని ప్రార్థనా మందిరం, చర్చిపై ఉగ్రవాద బృందాలు కాల్పులు జరిపారని తెలిపారు. చర్చి, ప్రార్థనా మందిరం రెండింటినీ తగులబెట్టినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పోలీసులు, పౌరులు, ఒక మతగురువు ఉన్నారు. ఈ విషయాన్ని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. ఓ చర్చిలో ప్రజల్ని బందీలుగా చేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. బందీలు చేసుకోలేదని డాగస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు తమంతటతామే లాక్ చేసుకున్నారని వెల్లడించారు.
ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండే డాగేస్తాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, గతంలోనూ ఈ ప్రాంతానికి సాయుధ తిరుగుబాటు చరిత్ర ఉందని రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీన్ని తీవ్రవాద దుశ్చర్యగా అభివర్ణించింది. మూడు రోజులు సంతాప దినాలుగా రాష్యా అధికారులు ప్రకటించారు.