Life Style
Coffee mask: కాఫీ మాస్క్ గురించి ఎప్పుడైనా విన్నారా.? లాభాలేంటంటే..
కాఫీ.. మనలో చాలా మందికి ఇది లేకుండా రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ప్రతీ రోజు కచ్చితంగా లేవగానే కాఫీ ఉండాల్సిందే. ఎంత ఒత్తిడితో ఉన్నా సరే ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు జోష్ వచ్చేస్తుంది. అయితే కాఫీ కేవలం రుచికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును కాఫీతో చేసే ఫేస్ మాస్క్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ మాస్క్ ద్వారా చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ మాస్క్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కాఫీ మాస్క్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ముఖ అందాన్ని పెంచుకోవచ్చు. ఇంతకీ కాఫీ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొంత కాఫీ పొడి తీసుకోవాలి. అనంతరం అందులో కొంత తేనె వేసి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం అంతకు ముందు తయారు చేసుకున్న క్రీమ్‌ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చివరిగా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకుంటే సరిపోతుంది.
కాఫీ మాస్క్ ఉపయోగాలు..
* కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మం అందంగా కనిపించేలా చేస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.
* ఇక కాఫీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖానికి సహజంగా గ్లో లభిస్తుంది.
* ఆయిల్ స్కిన్ వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. చర్మంలో అదనంగా ఉండే నూనెను తొలగించడంలో కాఫీ మాస్క్ ఉపయోగపడుతుంది.
* కాఫీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలు, మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇక కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి, తద్వారా ముఖం ముడుతలను తగ్గిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.