Andhrapradesh
YSRCP Incharges 11th List : ఆగని వైసీపీ కసరత్తు.. 11వ జాబితా విడుదల – ఎంపీ అభ్యర్థిగా రాపాక, లిస్ట్ ఇదే
YSRCP Incharges Latest List : కొత్త ఇంఛార్జులకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం.రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ ను అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా నియమించింగది.
YSRCP 11th Incharges List 2024: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా 11వ జాబితాను శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఇందులో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు రెండు పార్లమెంట్ నియోజకవర్గానికి సంంబధించిన ఇంఛార్జులను ప్రకటించింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్(Rapaka Vara Prasada Rao) ను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమించింది. బీవై రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జ్ గా ప్రకటించింది. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావు పేరును ఖరారు చేసింది వైసీపీ (YSRCP )అధినాయకత్వం.
వైసీపీ 11వ జాబితా:
కర్నూలు పార్లమెంట్ – బీవై రామయ్య
అమలాపురం పార్లమెంట్ – రాపాక వరప్రసాద్ రావు
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం – గొల్లపల్లి సూర్యారావు
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆ తర్వాత జనసేనను వీడిన ఆయన… వైసీపీ గూటికి చేరారు. ఈసారి కూడా మరోసారి ఆయనకు అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్‌ను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది. గొల్లపల్లి సూర్యారావు గతంలో మంత్రిగా పని చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన…. రాజోలు నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవలే టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు.
ఇక గతంలో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సముఖంగా లేని జయరామ్… ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను బీవై రామయ్యకు అప్పగించింది వైసీపీ అధినాయకత్వం.
గత జనవరి నుంచి వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. కొందరిని పూర్తిగా పక్కన పెట్టడమో కాకుండా, పార్లమెంటు అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన జాబితాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించారు. అయితే పార్టీ మార్పులు చేర్పులతో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు.
మరోవైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఖరారు అయ్యే అవకాశం ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బలమైన నేతలను ఆకర్షించే దిశగా వైసీపీ తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిణామాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.