Telangana

Yadagirigutta: రక్షాబంధనంతో యాదగిరీశుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తగణం..

Published

on

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవ సారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 21వరకూ అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యాయి ఉత్సవాలు. నేటినుంచి ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. రేపు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, ఎల్లుండి ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవలు నిర్వహిస్తారు. 14 ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ, మార్చి 15 ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవమార్చి 16న -ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ నిర్వహిస్తారు.

ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్యవిమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చత్రతీర్థం, 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవం నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు.

సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ పెట్టారు. యాదగిరిగుట్ట టౌన్, తుర్కపల్లి, రాయగిరి, వంగపల్లి, యాదగిరిపల్లిలో స్వాగత తోరణాలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. బ్రహోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాచకొండ సీపీ తరుణ్ జోషి క్షేత్రస్థాయిలో పర్యటించి.. స్థానిక పోలీసులతో రివ్యూ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఆర్టీసీ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version