Sports
WPL 2024: ఒక్క పరుగు తేడాతో ఓటమి.. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న ఆర్సీబీ ప్లేయర్లు.. ఎమోషనల్ వీడియో
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం (మార్చి 10) జరిగిన పదిహేడవ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా, హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైది. గెలవాల్సిన మ్యాచ్ లో అనుకోకుండా ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓటమి బాధతో గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయానికి 182 పరుగులు చేయాల్సి ఉంది. చివరి బంతికి 2 పరుగులు కావాలి. కానీ RCB బ్యాటర్ రిచా ఘోష్ విన్నింగ్ షాట్ ఆడడంతో విఫలమైంది. ఈ ఓటమితో, WPL 2024లో RCBకి ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.. RCB లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన తర్వాత, కెమెరామెన్ RCB డగౌట్‌ను చూపించాడు. అక్కడ జట్టు కెప్టెన్ స్మృతి తీవ్ర నిరాశలో కనిపించింది. ఉబికి వస్తోన్న కన్నీళ్లను ఆపుకుంటూనే ప్రత్యర్థులకు కరచాలనం అందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత మ్యాచ్‌లో యుపి వారియర్స్‌పై 139 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన ఢిల్లీ బెంగళూరుపై ధాటిగా ఆడింది. ఓపెనింగ్ జోడీ షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ పవర్‌ప్లేలోనే 50 పరుగులు చేసి శుభారంభం అందించారు.ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సీ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా భారత బ్యాటర్ రోడ్రిగ్జ్ కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. ఆ తర్వాత అలిస్ కీప్సీ కూడా వేగంఆ పరుగులు రాబట్టింది. వీరిద్దరి మధ్య 97 పరుగుల భాగస్వామ్యం ననమోదైంది. లక్ష్య ఛేదనలో బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్ లో 17 పరుగులు కావాలి. రిచా తొలి, ఐదో బంతుల్లో సిక్సర్లు బాది విజయంపై ఆశలు పెంచింది. ఇక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా రిచా జెస్ జోనాసన్ వేసిన బంతిని నేరుగా ఫీల్డర్ చేతికి కొట్టింది. షెఫాలీ వర్మ విసిరిన త్రోకు జోనాసన్ వెంటనే స్పందించడం, రిచాను రనౌట్ చేయడంతో బెంగళూరు 1 పరుగు తేడాతో పరాజయం పాలైంది.