International

శవపేటికలతో రైసీ సంతాప యాత్రలో వేలాదిగా జనం.. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్

Published

on

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేనీ అమిర్ అబ్దుల్లా హియన్‌ సహా స్మృత్యర్థం ఇరాన్‌ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు మంగళవారం మొదలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని తబ్రిజ్‌ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఇరాన్ ప్రజలు నల్లదుస్తులు ధరించి, జాతీయ జెండాలతో పాల్గొన్నారు. శవపేటికలపైకి పూలు చల్లుతూ తబ్రిజ్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతరం రైసీ, అమిర్‌ అబ్దుల్ హియన్‌ భౌతిక కాయాలను ఇరాన్‌లోనే రెండో అతిపెద్ద నగరం ఖోమ్‌కి తరలించారు. అక్కడ నుంచి రాజధాని టెహ్రాన్‌కు బుధవారం తరలించనున్నారు.

టెహ్రాన్‌లో భారీస్థాయిలో అంతిమ యాత్రను నిర్వహించనున్నారు. ఇందులో ఇరాన్‌ సుప్రీం నేత సయ్యద్ ఆయతుల్లా అలీ ఖమేనీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత రైసీ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం మషాద్‌ నగరానికి తీసుకువెళ్లి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి అమీర్‌లకు భారత్‌ తరఫున అధికారికంగా ఉప-రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ధన్ఖడ్ బుధవారం టెహ్రాన్‌కు చేరుకుని, ప్రమాదంలో మృతి చెందిన నేతలిద్దరికీ భారత్‌ తరఫున నివాళులు అర్పిస్తారని పేర్కొంది.

ఇక, ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ అడుగుజాడల్లో నడిచిన రైసీ.. 2021లో అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచీ దేశంలో హక్కుల ఆందోళనల పట్ల తీవ్రంగా స్పందించారు. అతివాద పంధాతోనే ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఇరాన్‌లో వందల మంది మరణాలకు కారణమయ్యారు. మితవాదుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ.. మతవాదాన్ని కొనసాగించారు. ముఖ్యంగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలను బలంగా అణచివేశారు. అధ్యక్షుడు కాక ముందు నుంచీ రైసీ ఇదే ధోరణిని ప్రదర్శించారని, వేలాది మందిని చంపించారని ఆరోపణలు ఉన్నాయి. ‘టెహ్రాన్‌ తలారి’గా ఆయన్ని పిలుస్తారు. మతపెద్దగా, ప్రాసిక్యూటర్‌గా 20 ఏళ్ల వయసులోనే ఇరాన్ రాజకీయాలపై రైసీ బలమైన ముద్రవేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version