Business
Wipro: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. విప్రో జాక్‌పాట్.. అమెరికా కంపెనీతో రూ.4500 కోట్ల డీల్!
Wipro: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో టెక్ కంపెనీలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెక్, ఐటీ కంపెనీలకు పెద్ద డీల్స్ అంతంమాత్రంగానే ఉంటుండడంతో చాలా కంపెనీలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల భారతీయ టెక్ కంపెనీలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి కంపెనీలు బిగ్ డీల్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో చేరిపోయింది దేశీయ టెక్ దిగ్గజం విప్రో.
ఐటీ సర్వీసెస్ మేజర్ విప్రో తాజాగా అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సుమారు 550 మిలియన్ డాలర్ల ఆర్డర్ అందుకుంది. ఈ డీల్‌పై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ కాంట్రాక్టు 5 ఏళ్ల పాటు ఉంటుందని, అమెరికా కంపెనీతో 550 మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది విప్రో. భారత దేశ కరెన్సీలో చూసుకుంటే ఈ డీల్ విలువ సుమారు రూ.4500 కోట్లకుపైగా ఉంటుంది. ఈ డీల్ ద్వారా 5 ఏళ్ల పాటు అమెరికా కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్‌కు కొన్ని ప్రొడక్టులు, పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాల కోసం నిర్వహించే సేవలను అందిస్తుందని ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, ఈ డీల్‌కి సంబంధించిన ఇతర విషయాలేమీ విప్రో బహిర్గతం చేయలేదు.
ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్న క్రమంలో భారీ డీల్ కుదుర్చుకోవడం కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సైతం శుభవార్తగానే చెప్పవచ్చు. ప్రాజెక్టులు పెరగడం ద్వారా ఉద్యోగుల తొలగింపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు.. ఈ డీల్‌పై పూర్తి విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు పలు విషయాలు వెల్లడించారు. ఇది 5 ఏళ్ల టైమ్ పీరియడ్ కాంట్రాక్ట్ అని తెలిపారు. ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్దిష్ట సొల్యూషన్స్ కోసం సర్వీసులు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టేజీలో మిగిలిన వివరాలను కంపెనీ బహిర్గతం చేయాలనుకోవట్లేదని వెల్లడించారు.
500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉండే పెద్ద డీల్స్, కాంట్రాక్టులు అనేవి టాప్ టైప్ ఐటీ సర్వీసెస్ సంస్థలకు చాలా కీలకంగా ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్స్ నేరుగా కంపెనీల రెవెన్యూ వృద్దిపై ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక ఏడాది క్యూ4లో విప్రో ఇప్పటికే అతిపెద్ద డీల్ 1.2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ రెవెన్యూ వృద్ధిని 9.5 శాతం మేర పెంచింది.