National

Windfall Tax: విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం.. డీజిల్, ATFపై జీరో.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

Published

on

Petrol Diesel Prices: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో విండ్‌ఫాల్ టాక్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై ఇది అమలవుతుంది. అయితే ఇప్పుడు మే నెలలో మాత్రం కేంద్రం ఆయిల్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దేనిపై ఎంత పన్ను ఉందో తెలుసుకుందాం.

India Windfall Tax: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం రోజు కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది టన్నుపై రూ. 9600 గా ఉండగా.. ఇప్పుడు అది రూ. 8400 కు దిగొచ్చింది. ఇది కేవలం క్రూడ్ పెట్రోలియంపై వర్తిస్తుండగా.. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై (ATF) మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగా (జీరో) ఉంది. ఈ కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) మంగళవారం రోజు ఆలస్యంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం.. ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తుంటుంది. ఒకటో తేదీ, 15వ తేదీ దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంటుంది. యథాతథంగా ఉంచడం, పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటుంది.

చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్ పెంచింది. అప్పుడు రూ. 6800 నుంచి టన్నుకు ఏకంగా రూ. 9600 కు చేర్చింది. దాదాపు రూ. 2800 ఒక్కసారే పెంచడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ రేట్లు వరుసగా పెరుగుకుంటూ పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తగ్గుతున్న క్రమంలోనే మళ్లీ విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లకు అనుగుణంగానే ఈ రేట్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటుందని చెప్పొచ్చు.

అంతకుముందు ఏప్రిల్ 4న కూడా క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను మెట్రిక్ టన్నుకు రూ. 4900 గా ఉండగా.. దానిని రూ. 6800 కు చేర్చింది. ఈ కనిష్ట ధర నుంచి చూస్తే రెండు సార్లు సవరణతో రూ. 4700 పెంచడం గమనార్హం.

Advertisement

దేశీయంగా ఉన్న చమురు ఉత్పత్తి దారులపై స్పెషల్ అడిషనల్ ఎక్స్చైజ్ డ్యూటీ (SAED) కింద విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తుంటుంది కేంద్రం. ఈ కంపెనీల్లో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ONGC లిమిటెడ్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి.

మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని 2022, జులై 1 న అమలు చేసింది. అప్పట్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా ఉన్న ఆయిల్ కంపెనీలు.. ఇక్కడ భారత్‌లో పెట్రోలియం వెలికితీసి.. పెట్రోల్, క్రూడాయిల్, డీజిల్, ఏటీఎఫ్ రూపంలో ఇక్కడ విక్రయించకుండా విదేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాయి. వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. అంతర్జాతీయంగా రేట్లు పెరిగితే.. ఇక్కడ టాక్స్ పెంచుతుంది. చమురు రేట్లు తగ్గితే.. టాక్స్ తగ్గిస్తుంటుంది.

ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపదు. కానీ పరోక్షంగా మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. ముడిచమురు రేట్లు పెరుగుతున్నప్పుడే విండ్‌ఫాల్ టాక్స్ పెంచుతుంది కాబట్టి.. అప్పుడు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి సంకేతాలు ఇస్తున్నట్లు అవుతుంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. లీటర్‌పై రూ. 2 చొప్పున తగ్గించగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ. 107.41 వద్ద ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 95.65 పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version