Andhrapradesh
Weather Alert: ఏపీని పలకరించిన నైరుతి.. పలు చోట్ల వర్షాలు.. తెలంగాణలో జూన్ 10లోపు అడుగు
నైరుతి రుతుపవనాలు మూడ్రోజుల ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమలోకి ఎంటరైన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ఏడాది మాన్‌సూన్ ఎఫెక్టుతో ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశమున్నట్టు హెచ్చరిస్తున్నారు. రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు, ఆ తర్వాత ఐదురోజులు మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడతాయని చెప్తున్నారు.
నైరుతి రాకతో ఏపీలో పలుజిల్లాలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. అనంతపురంలో భారీ వాన పడటంతో పలుచోట్ల విత్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ ఏరియాల్లో వాన పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ నియోజకవర్గం బంటారం మండలం నాగ్వారం వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. చిట్యాల మండలం శాంతినగర్‌లో పిడుగుపాటుకు ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది.