Hyderabad

Warangal Lok Sabha : తాటికొండ రాజయ్య యూ టర్న్..! BRS ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు..?

Published

on

Thatikonda Rajaiah : కడియం శ్రీహరి, కావ్య ఇచ్చిన షాక్ తో ఓరుగల్లు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో జంప్ అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించిన కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇప్పుడు అదే పార్టీలో చేరబోతుండగా.. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah)యూ టర్న్ తీసుకుని మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ టికెట్ ప్రయత్నాలు చేసిన ఆయన, వరంగల్ ఎంపీ టికెట్ కడియం ఫ్యామిలీకి ఇవ్వబోతున్నారనే సంకేతాలతో మళ్లీ ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు చూస్తున్నట్లు తెలిసింది. ఎంపీ టికెట్ హామీ ఇస్తే రాజయ్య గులాబీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ కు గుడ్ బై
1997లో కాంగ్రెస్ పార్టీ తో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రాజయ్య(Thatikonda Rajaiah), 2011లో బీఆర్ఎస్ చేరారు. 2009, 2012, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ తాటికొండ రాజయ్య 2023 ఎన్నికల్లోనూ అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కడియం శ్రీహరి దక్కించుకున్నారు. దీంతో అసంతృప్తికి గురైన రాజయ్య అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 3న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ పంపించారు. కాగా బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పడానికి కడియం శ్రీహరే ప్రధాన కారణమనే ఆరోపణలు కూడా వినిపించాయి.

కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినా…
బీఆర్ఎస్ తో తన 13 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుని మళ్లీ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. రాజీనామా చేసిన రోజే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసి, ఎంపీ టికెట్ ప్రతిపాదనను పెట్టారు. ఆ తరువాత కొద్దిరోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ అగ్రనేతల చుట్టూ తిరిగారు. కానీ రాజయ్య ను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే తాము సహకరించబోమంటూ కొందరు నేతలు స్పష్టం చేయడంతో ఆ పార్టీ అధిష్టానం కూడా రాజయ్యను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. దీంతో రాజయ్య పలుమార్లు ఢిల్లీ పెద్దలతో పాటు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులను కలిసి తన మనసులో మాటను చెప్పుకున్నారు. ఎంపీగా అవకాశం కల్పించాలని కోరుతూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ పార్టీలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా రాజయ్యను చేర్చుకోవడానికి నేతలు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో నిన్నమొన్నటి వరకు రాజయ్య కాంగ్రెస్ నేతల చుట్టూ తిరిగారు.

కడియం అటు.. రాజయ్య ఇటు
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్(BRS Party) టికెట్ ఖాళీ కావడంతో అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే ఆసక్తి నెలకొంది. ఇంతలోనే బీఆర్ఎస్ టికెట్ కోసం బాబుమోహన్, పెద్ది స్వప్నతో పాటు ఉద్యమకారులు జోరిక రమేశ్, బోడ డిన్నా తదితరులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదిలాఉంటే కడియం శ్రీహరి కారణంగానే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తాటికొండ రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లోకి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ వైపు వెళ్లడంతో బీఆర్ఎస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. క్యాండిడేట్లు జంప్ అవుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ అయిన తరువాతనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే వరంగల్ టికెట్ కోసం ఉద్యమకారులు, పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగా.. రాజయ్య ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version