International
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
- గాజా నుంచీ వైదొలగాలిపట్టుపడుతున్న హమాస్
- వెనక్కి తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్
- రఫాపై దాడి ఖాయమంటున్న నెతన్యాహు
- కొనసాగుతున్న కాల్పుల విరమణ చర్చలు
బీరుట్: గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. రఫాపై ఇజ్రాయెల్ దాడిని నివారించాలంటే దీనిపై త్వరగా సంతకం చేయాలన్న ఒత్తిడి కూడా ఆ మిలిటెంట్ సంస్థపై పెరుగుతోంది. తాజా ప్రతిపాదనలో మూడు దశలు ఉన్నాయి. ఇందులో ఆరు వారాల కాల్పుల విరమణ కూడా ఉంది. అయితే హమాస్ శాశ్వత పరిష్కారం కోరుతోంది. బందీలందరినీ విడుదల చేస్తామని, అందుకు ప్రతిగా యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగించాలని కోరుతోంది. అంతేకాదు.. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకుంటారా అన్నది కీలక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రధాని దూకుడుగానే ప్రకటనలు ఇస్తున్నారు. ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా.. రఫాపై దాడి ఖాయమంటున్నారు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ మాత్రం హమాస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణే శాశ్వత విరమణగా మారుతుందని నచ్చచెప్పుతున్నాయి. ఈ విషయం ఒప్పందంలో స్పష్టంగా లేదన్నది హమాస్ అభ్యంతరం. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న కాల్పుల విరమణ చర్చలను కొనసాగించడానికి ఓ బృందాన్ని పంపుతున్నట్లు గురువారం హమాస్ తెలిపింది.
2040 వరకు పనులు: ఐరాస
యుద్ధం కొనసాగే ప్రతి రోజూ గాజా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన ఇళ్లను పునర్నిర్మించాలంటేనే మరో 16 ఏళ్ల సమయం కావాలని, 2040 వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ”యుద్ధం జరిగే ప్రతి అదనపు రోజుకు గాజాలోని పాలస్తీనా పౌరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని ఐరాస అభివృద్ధి కార్యక్రమ పరిపాలనాధికారి అచిమ్ స్టెయినర్ తెలిపారు. ”దాదాపు 3,70,000 గృహాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 79 వేలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పునర్నిర్మాణానికి 30 నుంచి 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయి” అని పేర్కొన్నారు.
పాలస్తీనాకు గుర్తింపు వస్తుంది: భారత్
ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశం కావడానికి పాలస్తీనా చేసుకున్న దరఖాస్తు వీటో కారణంగా ఆమోదం పొందలేదని, అయితే రానున్న రోజుల్లో మళ్లీ దీన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. గత వారం ఈ ప్రతిపాదనను భద్రతామండలిలో అమెరికా వీటోచేసిన సంగతి తెలిసిందే.