National

‘వీవీప్యాట్‌ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా? మీ సమాధానం ఓటర్లను సంతృప్తి పరచాలి’- ఈసీని ప్రశ్నించిన సుప్రీం – Lok Sabha Elections 2024

Published

on

SC Questions EC On VVPAT Slip Counting : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. పబ్లిక్​ డోమేన్​లో ఉన్న సమాచారానికి, ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతున్న వివరాలకు పొంతన కుదరడంలేదని చెప్పింది. ఈ అంతరాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం గురించి ఆరా తీసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్‌కు ముందు వాటి తనిఖీ, ఆ తర్వాత సీల్‌చేసి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కోర్టుకు హాజరైన సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీతీశ్‌ కుమార్‌ వ్యాస్‌ ధర్మాసనానికి వివరించారు.

వీవీప్యాట్​ స్లిప్పులను వేగంగా లేక్కించలేరా?
‘ఓటింగ్‌ తర్వాత ఓటరుకు వీవీప్యాట్‌ నుంచి వచ్చే స్లిప్పు అందజేయడం సాధ్యమవుతుందా?’ అని ధర్మాసనం ఈసీని ప్రశ్నించింది. అయితే అలా చేయడం వల్ల రహస్య ఓటింగ్‌ విధాన లక్ష్యం దెబ్బతింటుందని, పోలింగ్‌ కేంద్రం వెలుపలకు వెళ్లాక అది ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఊహించలేమని ఎన్నికల అధికారి తెలిపారు. ‘వీవీప్యాట్‌ బాక్సులో నిక్షిప్తమైన స్లిప్పులు అన్నింటిని లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది. మెషీన్ల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీవీప్యాట్ల స్లిప్పులు పలుచటి కాగితంతో, అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు.

‘ఈసీ వివరణ ఓటరును సంతృప్తిపరచాలి’
ఎన్నికల ప్రక్రియపై ఓటరు విశ్వాసాన్ని పాదుకొల్పేలా చేయాల్సిన అవసరం ఉందని, సందేహాలకు తావివ్వరాదని సుప్రీం తెలిపింది. అయితే, పిటిషనర్లు కోరుతున్న బ్యాలెట్‌ విధానానికి మళ్లడం అనేది తిరోగమన సూచనే అవుతుందని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎం విధానాన్ని త్యజించాయని ఓ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సంతోష్‌ పాల్‌ తెలుపగా , విదేశాలన్నీ భారత్‌కన్నా ఆధునికంగా ఉన్నాయని భావించరాదంటూ ధర్మాసనం వారికి చురకలు అంటించింది. ఎన్నికల సంఘం చెబుతున్న సాంకేతిక అంశాలన్నింటినీ అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ ఆ సంస్థ ఇస్తున్న వివరణ ఓటరును సంతృప్తిపరిచేలా ఉందా లేదా అనేది గుర్తించాలని, మంచి ప్రయత్నం ఉంటే హర్షించాలని పిటిషనర్లకు సూచించింది.

ఈవీఎంపై చిహ్నాన్ని వేలితో నొక్కిన తర్వాత వీవీప్యాట్ల వద్ద ఓటును సరిచూసుకునే సమయంలో లైటు ఎప్పుడూ వెలిగేలా ఉండాలని, ఏడు సెకన్లపాటు మాత్రమే స్లిప్పు కనిపిస్తుంది కనుక అనుమానానికి తావులేకుండా చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌ సూచించారు. వీవీప్యాట్‌ నుంచి బయటకు వచ్చే స్లిప్పును ఓటరు తన చేతిలోకి తీసుకుని, ఓటు సక్రమంగానే నమోదైందని గుర్తించాక తానే అక్కడి బాక్సులో వేసే ఏర్పాటు ఉండాలని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version