Hyderabad
Vote For Modi On Wedding Card : పెళ్లికి గిఫ్ట్స్ వద్దు మోదీకి ఓటు వేయండి-వెడ్డింగ్ కార్డుపై వినూత్న అభ్యర్థన
Vote For Modi On Wedding Card : దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు(General Elections 2024) జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లికొడుకు తండ్రి చేసిన వినూత్న అభ్యర్థన అందరికీ ఆకట్టుకుంటుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన నందికంటి నర్సింహులు, ఆయన భార్య నందికంటి నిర్మల తమ ఏకైక కుమారుడు సాయికుమార్ వివాహం నిశ్చయించారు. వీరికి ఏప్రిల్ 4 పటాన్ చెరులో వివాహం చేయాలని నిర్ణయించారు. బంధువులు, స్నేహితులను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు నర్సింహులు పెళ్లి కార్డులు అందిస్తున్నారు. ఈ కార్డులతో ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బహుమతులు వద్దు మోదీకి ఓటు వేయండి
తన కుమారుడి వివాహానికి అతిథులను ఆహ్వానిస్తూ బహుమతులు తీసుకురావద్దని కోరారు నర్సింహులు. అందుకు బదులుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని కోరారు. వెడ్డింగ్ కార్డు మీద ‘మీరు ఇచ్చే ఉత్తమ బహుమతి నరేంద్ర మోదీకి మీరు వేసే ఓటు'(Vote For Modi instead of Gifts) అని ముద్రించారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని వినూత్నంగా అభ్యర్థించడంతో ఈ వెడ్డింగ్ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆరుట్ల గ్రామానికి చెందిన నర్సింహులు భవన నిర్మాణానికి సామగ్రి సరఫరా చేస్తుంటారు. ప్రధాని మోదీపై గౌరవంతోనే ఆయన తన కుమారుడి వెడ్డింగ్ కార్డుపై ఇలా విజ్ఞప్తి చేశారని తెలిపారు. గతంలో తన ఇద్దరు కూతుళ్ల వివాహ సమయాల్లో ఆయన ఈ విధంగా విజ్ఞప్తి చేయలేదు. వివాహ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నప్పుడు అందరూ ఈ విషయంపై ఆసక్తిగా అడుగుతున్నట్లు నర్సింహులు తెలిపారు. కుటుంబం సభ్యులు కూడా ఈ ఆలోచన బాగుందని, ముందుకు వెళ్లమని చెప్పారన్నారు.
గతంలోనూ
అయితే ఇలాంటి వినూత్న విజ్ఞప్తులు గతంలో కూడా చూశామంటున్నారు నెటిజన్లు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ తరహా విధానం మొదలైంది. ప్రధాని మోదీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తమ వివాహానికి బహుమతులు వద్దు ఎన్నికలలో మోడీకి ఓటు వేయమని అతిథులను కోరేవారు. ఇలా పెళ్లికార్డులపై ముద్రించేవారు. ఉత్తరాఖండ్‌లోని ఓ వ్యక్తి తన కుమారుడి వెడ్డింగ్ కార్డుపై ప్రధాని మోదీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇలా ముద్రించిన వ్యక్తికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చి వివరణ కోరింది.