Andhrapradesh

Vizag Steel Plant : అలాంటి ప్రశ్నే లేదు…! వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

Published

on

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు. అలాంటి ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.

పరిశ్రమ పునరుద్దరణకు ప్రధానికి నోట్‌ సమర్పిస్తానని కేంద్రమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని వ్యాఖ్యానించారు. అధ్యయనం కోసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వచ్చానని చెప్పిన ఆయన… స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అని అన్నారు. త్వరలోనే ప్రధానికి నివేదిక సమర్పించి ఆయన ద్వారా సానుకూల నిర్ణయానికి కృషి చేస్తామని వివరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన అవసరం లేదని కుమారస్వామి చెప్పారు. వంద శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ కొనసాగుతుందన్నారు. అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పుకొచ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు ఆందోోళనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.


మూడేళ్లుగా ప్లాంటులో 60 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పెట్టుబడులు లేక ఫర్నేస్‌లను నిలిపివేయాల్సి వచ్చింది. 2022 నుంచి ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌-3 నిలవడంతో రెండున్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ఆగింది. విశాఖ ఉక్కులో భాగమైన రాయబరేలి ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంటును రూ.2వేల కోట్లకు అమ్మేశారు.

విశాఖలో విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. చెన్నై, హైదరాబాద్‌లోని ఉక్కు యార్డులతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను రూ.475 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నగరం మధ్యలో 19వేల ఎకరాల భూములు ఉండటంతో అవి అందరిని ఊరిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో… రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించటంతో పాటు ఎన్డీయేలో కీలక భాగస్వామిగా మారింది. ఎన్నికల ముందు వరకు ప్రైవేటీకరణ ఆగదనే పరిస్థితులు ఉండేవి. కానీ టీడీపీ కేంద్రంలో కీలకంగా మారటంతో….. ప్రైవేటీకరణకు బ్రేకులు పడుతాయా..? లేదా…? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కుమార స్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రావటంతో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానికి అన్ని వివరాలను సమర్పిస్తానని చెప్పుకొచ్చారు. ప్రైవేటీకరణ ఉంటుందా అనే ప్రశ్నకు బదులిస్తూ… అలంటి ప్రశ్నే లేదంటూ తోసిపుచ్చారు. ఈ పరిణామాల క్రమంలో…. త్వరలోనే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన ఉంటుందా..? లేదా…? అనేది చూడాలి….!

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version