National
Vishal : తమిళనాడు ప్రభుత్వంపై విశాల్ సంచలన కామెంట్స్.. మోదీ గారు మమ్మల్ని పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్..
Vishal : తెలుగువాడైనా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. తమిళ్ – తెలుగులో విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. త్వరలో రత్నం సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రత్నం(Rathnam) సినిమా ఏప్రిల్ 26న రాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇటీవల కాంట్రవర్సీలలో ఎక్కువగా ఉంటున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీకు ఎవరు సపోర్ట్ గా మాట్లాడట్లేదు అని అడగగా విశాల్ స్పందిస్తూ.. తమిళనాడులో ఘోరాతిఘోరం జరుగుతుంది. డబల్ ట్యాక్సేషన్ జరుగుతుంది. ఎవరికీ ధైర్యం లేదు చెప్పడానికి. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని, తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై గారిని అడుగుతున్నాను మీరు ఎందుకు ఊరుకుంటున్నారు. దేశమంతా వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొచ్చారు. కానీ మా తమిళనాడులో మాత్రం GST 18 శాతంతో పాటు లోకల్ బాడీ ట్యాక్స్ 8 శాతం కట్టిస్తున్నారు ఏడేళ్ల నుంచి. మీరు దీని గురించి చూడండి. నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. నాకు అంటే పెళ్ళాం, పిల్లలు లేరు. వేరే వాళ్లందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి. అందుకే వాళ్ళు భయపడతారు. నేను భయపడను. ఒక సారి మా అమ్మకి ఫోన్ చేసి కూడా బెదిరించారు. మా అమ్మ కూడా వాళ్లకి ధైర్యంగా సమాధానం చెప్పింది అని అన్నారు.
అలాగే.. నేను కార్లు వాడటమే మానేసాను. మా తమిళనాడులో రోడ్ల వల్ల రెగ్యులర్ గా కార్ రిపేర్ వస్తున్నాయి. అవి చేయించిన ప్రతిసారి లక్షల్లో బిల్లు వస్తుంది. అందుకే నా కార్లని అమ్మేసి ఒక మంచి సైకిల్ కొనుక్కున్నాను. మా పేరెంట్స్ కోసం మాత్రం ఒక కార్ ఉంచాను అని తెలిపారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా తమిళనాడు ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో విశాల్ తమిళ రాజకీయాల్లో చర్చగా మారాడు. అసలే 2026 ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పాడు. దీంతో విశాల్ వ్యవహారం తమిళనాడులో వైరల్ గా మారింది.