Hashtag
Viral Video: రాజీవ్, సోనియాల వివాహం ఎలా జరిగిందో తెలుసా.? వైరల్ వీడియో..
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి వివాహ వేడుకులను వీక్షించాలని కోరుకుంటారు. అందుకే ప్రస్తుతం సినీ, రాజకీయ నాయకుల పెళ్లి వేడుకలను న్యూస్ ఛానెల్స్‌లోకూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. మరి 56 ఏళ్ల క్రితం వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారితే ఎలా ఉంటుంది.
మాజీ భారత ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 1968లో రాజీవ్, సోనియాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత వీరి వివాహ వేడుక వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రాజీవ్ గాంధీకి వివాహ సమయంలో ఆయన వయసు 23 ఏళ్లు కాగా, సోనియా గాంధీ వయసు 21 ఏళ్లు.
న్యూఢిల్లీలోని సఫ్గర్‌జంగ్ రోడ్ నెంబర్ 1లోని ఇందిరాగాంధీ నివాసంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోదరి విజయ లక్ష్మి పండిట్, సంజయ్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్ కావడంతో వారు ధరించిన దుస్తులు ఏ రంగులో ఉన్నాయన్నది స్పష్టం తెలియడం లేదు.
ఇక అప్పట్లోనే రాజీవ్ గాంధీ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు. వివాహం తర్వాతి రోజు అశోక్ హోటల్‌లో పార్సీ, కాశ్మీరీ, ఇటాలియన్ వంటకాలతో రిసెప్షన్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సోనియా, రాజీవ్‌ల పరిచయం కేంబ్రిడ్జిలో జరిగిన విషయం తెలిసిందే. పైచదవుల కోసం వెళ్లిన రాజీవ్‌కు అక్కడ సోనియా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.