Andhrapradesh
వారాహిపై పవన్ కల్యాణ్ ప్రచారానికి అనుమతులు లేవని చెప్పిన పోలీసులు
Varahi Vehicle: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే, వారాహిపై ప్రచారానికి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. వారాహి వాహనం ఏపీ వ్యాప్తంగా తిరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర అనుమతులు తీసుకోవాలని అన్నారు.
ఇప్పటివరకు వారాహిపై ప్రచారానికి జనసేన అనుమతులు తీసుకోలేదన్నారు. చేబ్రోలు జనసేన బహిరంగ సభకు మాత్రం పోలీసులు అనుమతులిచ్చారు. వారాహి స్థానంలో జనసేన నేతలు మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, పిఠాపురం వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ టీడీపీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచారానికి ప్రారంభిస్తున్నారు. వారాహికి అనుమతి నిరాకరించడంతో పవన్ కల్యాణ్ రోడ్ షో లేకుండానే హోటల్ నుంచి చేబ్రోలులో వెళ్లనున్నారు. ఆయన అక్కడ ఐసర్ వాహనంపై ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.