National

Underwater Metro: దేశంలోనే తొలిసారిగా.. నీటి అడుగున మెట్రో రైలు!

Published

on

Underwater Metro Kolkata : భారత్​లోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. కోల్‌కతాలో నిర్మించిన తొలి అండర్​వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించనున్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతా ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కి.మీల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్​తో నిర్మితమైన ఈ అండర్​వాటర్​ మెట్రో టన్నెల్‌ హావ్‌డా మైదాన్​ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్​ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్​ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది.

తగ్గనున్న ప్రయాణ సమయం
సొరంగం​ అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు. బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. ఈ సొరంగ మార్గాన్ని నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమిలోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌కు ఈ టన్నెల్​ నిర్మాణం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుంది. ఇక ఈ అండర్​వాటర్​ మెట్రో మార్గం ఏర్పాటుతో ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్‌, హావ్‌ డా, హావ్‌ డా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్​లు ఉన్నాయి.
యూకే సరసన భారత్​
మెట్రో టన్నెల్​ లోపలికి నీరు చొచ్చుకురాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీటు రింగులను ఫిక్స్​ చేశారు ఇంజినీర్లు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్‌ గాస్కెట్లనూ అమర్చారు. ఈ తరహా టెక్నాలజీని యూరోస్టార్‌ అనే కంపెనీ లండన్‌, ప్యారిస్‌ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ఇక ఈ ప్రతిష్ఠాత్మక హుగ్లీ అండర్​వాటర్​ మెట్రో ప్రాజెక్టుతో భారత్​కూ ఈ ఘనత దక్కింది.

https://twitter.com/i/status/1764953252896845932
66 రోజుల్లోనే తవ్వకం
టన్నెల్‌ను తవ్వడానికి బాహుబలి యంత్రాలను వాడారు. జర్మనీలో రూపొందించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ మిషన్​ సొరంగాన్ని తవ్వింది. కాగా, ఈ అండర్​వాటర్​ మెట్రో మార్గం చుట్టుపక్కల అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేశారు మెట్రో అధికారులు.

ఒకవేళ మధ్యలోనే మెట్రో ఆగితే?
కొన్నిసార్లు అనేక సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతుంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాలకు లోనవ్వకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఈ ప్రాజెక్ట్​ అధికారులు తెలిపారు. ఇలాంటి సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్​కతా మెట్రో జనరల్​ మేనేజర్​ ఉదయ్​ కుమార్​ రెడ్డి​ తెలిపారు.

“ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డాం. రాత్రి 12 గంటల వరకు పనిచేసేవాళ్లం. తద్వారా యాత్రికులకు లేదా ప్రయాణికులకు నదీ గర్భంలో ప్రయాణిస్తున్నామనే అనుభూతిని కలిగించేలా ప్రయత్నం చేశాం. అంతకుముందు పెయింటింగ్స్​ ద్వారా ఈ మెట్రో ప్రాజెక్ట్​ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేశాం. ఇంజనీరింగ్​లో ఈ అండర్​వాటర్​ మెట్రో నిర్మాణాన్ని ఒక మార్వెల్​గా చెప్పవచ్చు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్​వాటర్​ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నాం.”- ఉదయ్​ కుమార్​ రెడ్డి, కోల్​కతా మెట్రో జీఎం

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version