International

ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి 80 దేశాల మద్ధతు- సంతకం చేయని భారత్​ – Swiss Peace Summit

Published

on

Swiss Peace Summit On Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరిగే ఏ శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు నినదించాయి. ఉక్రెయిన్‌లో శాంతిసాధనే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌ నిర్వహించిన రెండు రోజుల సదస్సులో దాదాపు 100 దేశాలు పాల్గొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనపై మెజారిటీ దేశాలు అంగీకరించాయి. కానీ భారత్​, యూఏఈ తదితర దేశాలు ఏకీభవించలేదు.

‘ఉక్రెయిన్‌లో శాంతి’ అంశంపై స్విట్జర్లాండ్‌లోని బర్జెన్‌స్టాక్‌ రిసార్టులో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. శనివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదలతో ముగిసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడం, అణు భద్రత, ఆహార భద్రత, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఐక్యరాజ్య సమితి ఒప్పందాలతో పాటు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించేలా యుద్ధం ముగించే దిశగా కీలక ఒప్పందం కుదరాలని ప్రకటనలో వారు పేర్కొన్నారు. అప్పుడే ఉక్రెయిన్‌లో దీర్ఘకాలం శాంతి నెలకొంటుందని తెలిపారు. అయితే సదస్సులో పాల్గొన్న మెజారిటీ దేశాలు అంగీకరించడం దౌత్యనీతి ఏం సాధించగలదో నిరూపిస్తోందని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు వియోలా పేర్కొన్నారు.

సంతకం చేయని బ్రిక్స్ సభ్య దేశాలు
ఈ ప్రకటనపై భారత్‌, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, బ్రెజిల్ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఇవన్నీ బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాలే. వీటికి రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిష్కార మార్గం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని భారత్‌ స్పష్టం చేసింది. సంక్షోభ పరిష్కారానికి అన్నింటికంటే ముఖ్యంగా మాస్కో, కీవ్‌ నిజాయతీగా ప్రయత్నించాలని సూచించింది. మన దేశం తరపు నుంచి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి పవన్‌ కపూర్‌ సదస్సుకు హాజరయ్యారు. అయితే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మధ్యవర్తి తరహా పాత్ర పోషిస్తున్న తుర్కియే ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేసింది. చైనాకు ఈ సదస్సుకు హాజరుకాలేదు. రష్యాకు ఆహ్వానం అందలేదు.

‘రష్యాతో యుద్ధానికి ఈ సాయం సరిపోదు’
స్విట్జర్లాండ్‌ సదస్సులో పాల్గొన్న దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మా దేశానికి అంతర్జాతీయంగా ఉంటున్న మద్దతు తరిగిపోవడం లేదని ఈ సదస్సు చాటిచెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మన దేశంపై యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. ఆయన్ను ఎలాగైనా ఆపాలి. పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సాయం మేము యుద్ధం గెలిచేందుకు సరిపోదు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌ భూభాగాన్ని వీడితే వెంటనే ఆ దేశంతో శాంతి చర్చలు ప్రారంభిస్తాం. చైనా మాకు శత్రువేమీ కాదు. చైనా ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తున్నాం. ఆ దేశం నుంచి మేము అదే ఆశిస్తున్నాం’ అని సదుస్సులో వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version