Andhrapradesh

Ugadi Festival 2024: అరటి వంటలు అదరహో.. 56 వెరైటీలతో ఉగాది సంబరాలు..

Published

on

సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమలోని మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటారు.వారు ఏం చేసినా ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వినూత్నతను చాటుతారు. కోనసీమ అంటే కొబ్బరి తోటలే కాదు.. ఇక్కడ అరటిపంటకు కూడా ఎంతో ప్రత్యేకత అని చెప్పాలి…వేలాది ఎకరాల్లో సాగవుతున్న అరటి కోనసీమ జిల్లా నుండి అనేక రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఈ ప్రాంతం ఇప్పటికే ప్రాముఖ్యతను సంతరించుకుంది.అయితే సర్వసాధారణంగా అరటిని ఒకటి రెండు రకాలుగా మాత్రమే వంటకాలు చేస్తుంటారు.కానీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆర్యవైశ్య మహిళలు మాత్రం ఉగాది ఉత్సవాల పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా పండే అరటి పంట నుంచి 56 రకాల వంట కాలు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. ఇక్కడ మహిళలంతా ఒక్క తాటిపైకి చేరి వంటకాలతో చైతన్యాన్ని చాటి చెప్పేందుకు ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు.

200 మంది సభ్యులుగా ఉన్న ఆర్యవైశ్య మహిళలు ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు.వేడుకలో భాగంగా అరటి పంటలోని అరటికాయలు, అరటి పువ్వులు, అరటి దూటతో వెరైటీ వంటకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 రకా వంటకాలు చేసి అబ్బురపరిచారు. ఈ వంటకాల్లో ప్రధానంగా అరటికాయ పాయసం, అరటి హల్వా బాల్స్,అరటి దూట పచ్చడి, అరటికాయ పొడి, అరటి లింగాల బజ్జి, అరటి లింగాల కూర, ఇలా రకరకాల రెసిపీస్ తయారు చేశారు.అంతేకాకుండా నేటి తరం పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎంతగా ఎగబడతారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పిల్లలకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ తరహాలో ఎట్రాక్ట్ చేసేలా ట్రెడిషనల్ వంటకాలను కూడా ఫాస్ట్ ఫుడ్స్ వంటకాల తరహాలో తయారు చేశారు. అరటికాయ సాండ్విచ్, కట్లెట్, బనానా స్ప్రింగ్స్, అరటికాయ సూప్, లాలిపాప్స్, అరటికాయ కారపూస ఇలా రకరకాల రెసిపీస్ తయారుచేసి పిల్లలను కూడా ఎట్రాక్ట్ చేయగలమంటూ నిరూపించారు.

ఈ వంటకాల పోటీ కార్యక్రమం ఎంతో ఫ్యాషన్ గా, ట్రెండీగా సాగింది. అరటి తో తయారుచేసిన ఈ వంటకాలు గుమగుమలాడుతూ భోజన ప్రియులను ఎంతగానో నోరూరించాయి.అరటి తింటే ఒంటికి మంచిదంటూ డాక్టర్లు కూడా చెప్పడంతో ఈ వంటలు తినడానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారు స్థానికులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version