International

ట్రంప్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్.. అతని సతీమణి భారత సంతతి మహిళ.. ఆమె ఎవరంటే?

Published

on

Usha Chilukuri Vance : త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. అమెరిక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేశారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించాడు. 39ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చిన వాన్స్.. చివరకు ట్రంప్ విధేయుడిగా మారాడు. దీంతో ట్రంప్ అతన్ని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు.

రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడి వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పేరు ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా పనిచేశారు. నాలుగేళ్లు అదే విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో ఉషా చిలుకూరి సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.


జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో వివేక్ రామస్వామి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జేడీ వాన్స్ పేరును ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అతడో గొప్ప ఉపాధ్యక్షుడు అవుతాడని ప్రశంసించారు. మేమిద్దరం క్లాస్ మేట్స్ అని రామస్వామి చెప్పారు. భారతీయ-అమెరికన్ బయోటెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి. ఒకప్పుడు 2024 వైట్ హౌస్ రేసుకు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యర్థిగా ఉన్నారు. జనవరిలో తనపేరును ఉపసంహరించుకొని ట్రంప్ ను ఆమోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version