International

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

Published

on

Donald Trump Injured in Shooting : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పై కాల్పులు జరిపారు. ట్రంప్ చెవికి బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయమైంది. స్టేజీపైనే ట్రంప్ కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి భద్రత కల్పించారు. ఈ కాల్పుల్లో ట్రంప్ గన్ మెన్ సహా, ఎన్నికల సభలో పాల్గొన్న పౌరుడు మరణించినట్లు తెలిసింది. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

దుండగులు కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయమై రక్తస్రావం కావడంతో ఆయన్ను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిత్స అనంతరం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక దుండగుడిని హతమార్చగా.. మరో దుండగుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఆస్పత్రిలో చికిత్స అనంతరం కొద్ది గంటలకే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు.


కాల్పుల ఘటనపై ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశంలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం మరణించిన షూటర్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. నా కుడి చెవి పైభాగానికి బెల్లెట్ తగిలింది. బుల్లెట్ గాయం కాగానే ఏదో తప్పు జరిగిందని నాకు వెంటనే అర్ధమైంది. ఎందుకంటే నేను పెద్దశబ్దం విన్నాను. తుపాకి కాల్పులు మోతతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని ట్రంప్ చెప్పారు.


ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో స్పందించారు. అమెరికాలో హింసకు చోటు లేదు. ఇలాంటి ఘటనలు ఖండించేందుకు అందరం ఏకంగా కావాలని బైడెన్ అన్నారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల ద్వారా ఆయన వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. అమెరికాలో హింసకు తావు లేదని అన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version