National
TRP Gaming Zone: గేమింగ్‌జోన్ అగ్నిప్రమాదంలో 9 మంది పిల్లలు సహా 27 మంది సజీవ దహనం.. గుర్తుపట్టలేనంత కాలిపోయిన శవాలు
సమ్మర్ హాలీడేస్ దానికి తోడు శనివారం వీకెండ్. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వినోదం కోసం గేమింగ్ జోన్‌కు వెళ్లారు. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని టీఆర్పీ్ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం.. 27 మందిని బలితీసుకుంది. సహాయక చర్యలు పూర్తయితే మరిన్ని మృతదేహాలు బయటపడనున్నాయి. శనివారం రాత్రి ప్రారంభమైన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మృతుల్లో 9 మంది చిన్నారులు, పలువురు మహిళలు ఉన్నారు. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో.. ఆ మంటల్లో చిక్కుకుని కొందరు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యారని.. అలాంటి వారిని గుర్తించడం కష్టం అవుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ గేమింగ్‌జోన్ నుంచి బయటికి వెళ్లేందుకు అందులో ఉన్నవారు ప్రయత్నించగా.. ఆ లోపే మంటలు భారీగా ఎగిసిపడి.. పైకప్పు కూలిపోయింది. దీంతో ఈ పైకప్పు కింద చిక్కుకుని కొందరు మంటల్లో కాలిబూడిదయ్యారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శనివారం రాత్రి 11 గంటల సమయానికి 9 మంది చిన్న పిల్లలు సహా మొత్తం 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక మృతదేహాలు ఎక్కువగా కాలిపోవడంతో వారు ఎవరు అనేది గుర్తించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానికి ఇంకా కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి వెల్లడించారు. భారీగా మంటలు ఎగసిపడటం వల్లే టీఆర్‌పీ గేమ్‌జోన్ పైకప్పు ఫైబర్ డోమ్ కుప్పకూలిపోయిందని తెలిపారు. ఫైబర్ డోమ్ కూలిపోయిన సమయంలో చిన్నారులు ఆటల్లో బిజీగా ఉండగా.. వారిని చూస్తూ తల్లిదండ్రులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక టీఆర్‌పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తి పేరు మీద ఉందని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. అయితే యువరాజ్ సింగ్ సోలంకితోపాటు మేనేజర్ నితిన్ జైన్ సహా ముగ్గురిని ఈ ఘటనలో ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మొత్తం పూర్తయితే తప్ప ఎంత మంది మరణించారు.. ఇంకా ఎంత మందికి గాయాలు అయ్యయాని వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనతో రాజ్‌కోట్ నగరంలోని ఇతర గేమ్‌జోన్‌లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఇక రాజ్‌కోట్ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 9 మంది చిన్నారులు సహా 27 మంది ప్రాణాలను కబళించిన ఈ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి.. సహాయ చర్యల గురించి ఆరా తీశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొకరికి రూ.50వేలు అందిస్తామని చెప్పారు.