Spiritual
మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదన్న తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొంటారు. అంతేకాదు టీటీడీ తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు సేవలు అందించే అవకాశం కూడా అందించింది. గతంలో శ్రీవారి సేవకులుగా కొందరికే అవకాశం దక్కేది.. ఇప్పుడు టీటీడీ ఆ పద్దతిని మార్చింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవకులు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీవారి సేవ కోట ఆన్‌లైన్‌లో విడుదల చేసిన వెంటనే అన్ని తేదీలు బ్లాక్ అవుతున్నాయని కొందరు భక్తులు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. బుక్ చేసుకునే సమయంలో బఫరింగ్ అవుతోందని.. తద్వారా తమలాంటి వారికి ఎక్కడో పారదర్శకత లోపించిందనే అనే అనుమానాలు ఉన్నాయన్నారు. శ్రీవారి సేవ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంతో పారదర్శకతతో రూపొందించబడిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్నారు. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు ఇవ్వొద్దని.. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఉచితంగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి దగ్గర తోపులాట జరుగుతోందని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల ఇబ్బంది పడుతున్నారన్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు ఒకే క్యూ లైన్ విధానంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. విజిలెన్స్, ఆలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు
తిరుమలలో ప్రైవేట్ హోటళ్ళల్లో అధిక రేట్లు వసూలు చేస్తున్నారని.. అలాగే అఖిలాండం వద్ద వీధి వర్తకులు భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్ళల్లో రేట్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ టూరిజం వారికి తక్కువ అద్దెతో 4 హోటళ్లు కేటాయించామని.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీధి వర్తకులను అదుపు చేస్తారన్నారు.
ఏపీలో ఎన్నికల కారణంగా సిఫార్సు లేఖల్ని స్వీకరించడం లేదని.. శ్రీవాణి ట్రస్టు ద్వారా బ్రేక్ టికెట్టు పొందవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఎన్ ఆర్ ఐ దర్శనం కూడా పొందవచ్చని.. కోడ్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం కుదరదని ఈవో తెలిపారు. తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు.