Andhrapradesh
తిరుపతికి వరం ప్రకటించిన కేంద్రం
పాఠశాలలకు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. సెలవులు రాగానే ఎక్కువమంది కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొగ్గుచూపుతారు. తిరుపతి వెళ్లే ఏ రైలు చూసినా రిజర్వేషన్ దొరకడం కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తిరుమల భక్తుల కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఒక్కో సర్వీస్ చొప్పున ఈ రైలు అందుబాటులోకి వచ్చింది.
నెంబర్ 07489 రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.