Andhrapradesh
Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!
Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
ఈ కెమెరాలను ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఈ- వేలానికి సంబంధించిన ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరు ద్వారా సంప్రదించవచ్చు. లేదా టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వివరించింది.
ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి ఆగష్టు 7వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
ఆగష్టు 7న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు.
ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతామందిరం, ఆర్‌ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.
మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
రూ.1.5 కోట్లు విరాళం
తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ (నేషనల్ స్టిల్స్, సిఎఫ్ఓ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత టిటిడి ఈఓ జె.శ్యామల రావుకు అందజేశారు.