Andhrapradesh
Tirumala: తిరుమల శ్రీవారికి హుండీకి కళ్లు చెదిరే ఆదాయం..
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రెండేళ్లు క్రితం 2022 ఫిబ్రవరిలో ఎటువంటి ప్రత్యేకమైన శుభదినం లేకుండానే ఇలాగే శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అప్పుడు కూడా సరిగ్గా రూ.5.41 కోట్లు ఆదాయం రావడం విశేషం. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతుంది. ఐతే అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్‌హౌస్ వరకు ఉంది.
వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోట మూడు నెలల ముందే విడుదల
వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని, అవి వాస్తవదూరమైనవి అని టీటీడీ తెలిపింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డయని. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని తెలిపింది
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.కావున సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.