Andhrapradesh
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా, ఈ నగరాల్లో అందుబాటులోకి!
టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలిసారిగా తెలుగు క్యాలెండర్‌ను ప్రచురించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీటిని అమ్మకానికి అందుబాటులో తెస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వచ్చే వారం నుంచి భక్తులకు క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో నెలవారీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, వివిధ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న వేద పండితులచే ఉగాది ఆస్థానం మరియు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. టీటీడీ పంచాంగం ఇప్పుడు తిరుమల, తిరుపతితో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉందన్నారు. అలాగే 521వ అన్నమయ్య వర్ధంతి వేడుకలను ఏప్రిల్ 5న సప్తగిరి సంకీర్తన గోష్టితో నారాయణగిరి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 21-23 వరకు తిరుమలలోని వసంత మండపంలో టీటీడీ శ్రీవారి సాలకట్ల వసంతోత్సవం నిర్వహిస్తోందన్నారు ఈవో. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారన్నారు. ఏప్రిల్ 22 ఉదయం శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్లతోస్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17-25 వరకు వైభవంగా నిర్వహిస్తారని.. ఏప్రిల్ 22న శ్రీ సీతా రామ కళ్యాణం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
శ్రీ కోదండరామస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి తిరుపతిలో ప్రారంభమయ్యాయని.. ఏప్రిల్ 12-20 వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 17-25 వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. రానున్న మూడు నెలల్లో వేసవి సెలవులు ఉండటంతో.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ టీటీడీ తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన విషయాన్ని ఈవో గుర్తు చేశారు. టీటీడీ మాన్యుస్క్రిప్ట్స్ డిజిటలైజేషన్ ప్రాజెక్ట్‌ని ప్రశంసించారన్నారు. పురాతన తాళపత్రాలు, రాగి పలకలు మొదలైనవాటిని భద్రపరచడం, రక్షించడం ద్వారా భవిష్యత్ తరాల కోసం జ్యోతిష, న్యాయ శాస్త్రం, విజ్ఞాన, వైద్య, ఇతర రంగాలలో జ్ఞానం అందించినట్లు అవుతుందని సీజేఐ ప్రశించిన విషయాన్ని గుర్తు చేశారు.