Spiritual

తిరుమలలో శ్రీవారి సేవకులుగా పని చేయాలనుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్..!!

Published

on

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం.. తిరుమల. సాక్షాత్ శ్రీమహా విష్ణువు ఇక్కడ శ్రీవేంకటేశ్వస్వామివారిగా వెలిశాడని కోట్లాదిమంది భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కోట్ల మంది తిరుమలేశుడిని దర్శించుకుంటారు. తమ మొక్కులను చెల్లించుకుంటుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

2000లో వలంటరీ వ్యవస్థ.. 2000 సంవత్సరంలో ఈ వలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం, ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారి కోసం శ్రీవారి సేవకులు పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో శ్రీవారి సేవకులుగా పని చేయడానికి ఆసక్తి చూపే భక్తుల కోటాను విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వేర్వేరు చోట్ల.. ఎంపికైన వలంటీర్ల సర్వీసులను టీటీడీ అధికారులు.. తిరుమల, తిరుపతి, నవనీతం, పరాకమణి సేవల్లో వినియోగించుకుంటారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల రద్దీని నియంత్రించడం, హుండీ లెక్కింపు వంటి ప్రదేశాల్లో శ్రీవారి సేవకుల సర్వీసులను అధికారులు వినియోగించుకుంటారు. వారం రోజుల పాటు ఏడుకొండలవాడి సన్నిధిలో ఉండే మహద్భాగ్యాన్ని ఈ వలంటరీ సర్వీసు భక్తులు పొందగలుగుతారు.

ప్రత్యేక మార్గదర్శకాలు.. తిరుమలలో క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లు, ఆలయ పరిసరాలు, వెంగమాంబ అన్నదాన సత్రం, పరాకమణి, లడ్డూ కౌంటర్లు.. వంటి చోట్ల వలంటీర్ల సేవలను టీటీడీ అధికారులు అందుబాటులోకి ఉంచుతారు. శ్రీవారి సేవకులుగా సర్వీసులను అందజేయాలనుకునే వారి కోసం టీటీడీ అధికారులు ఏప్రిల్, మే నెల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేశారు. దీనికోసం కొన్ని నియమ నిబంధనలు, మార్గదర్శకాలను కూడా అధికారులు రూపొందించారు.

10 మందితో టీమ్.. 10 మంది భక్తులను ఒక్కో బృందంగా టీటీడీ అధికారులు ఎంపిక చేస్తారు. ఈ గ్రూపు సభ్యులు తమ పేరు, చిరునామా, వయస్సు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. శ్రీవారి సేవకు ఏ కులానికి చెందిన వారైనా అర్హులే. స్వామివారి సేవలో పాల్గొనేవారు తప్పనిసరిగా తిరునామం లేదా తిలకాన్ని ధరించాలి. కుంకుమ లేదా చందనాన్ని బొట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరుమల సేవా సదన్‌లో ఈ టీమ్ రిపోర్ట్ చేయాలి.

రోజూ కనీసం 6 గంటలు.. వలంటీర్లు- రోజుకు కనీసం ఆరు గంటల పాటు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి. శ్రీవారి సేవ కోసం వచ్చే వారికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ధన, వస్తు రూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఆయా సేవలన్నీ స్వచ్ఛందమే. శ్రీవారి మీద భక్తితో మాత్రమే వలంటీర్లు ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్.. శ్రీవారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. మహిళలు ఆరెంజ్ రంగు చీర, రవిక ధరించాలి. పరకామణి కార్యకలాపాలు ఈ నెల 5వ తేదీ నుంచి అన్నదానం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కొత్త పరకామణి భవనానికి మార్చినందున ఇక్కడ సేవలందించే వారికి చివరి రోజు మాత్రమే సుపాదం/స్పెషల్ ఎంట్రీ దర్శన్ హాల్ ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు టీటీడీ అధికారులు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version