Andhrapradesh
Tirumala Laddu:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూలు ఇక మరింత సులభంగా..
TTD to set up 15 Additional Laddu Counters in Tirumala: తిరుమల లడ్డూకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేనివారు ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి తరిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం వచ్చిందని భావిస్తుంటారు. అందుకే దర్శనం తర్వాత లడ్డూకౌంటర్ల వద్ద నిరీక్షించి మరీ లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించిన భక్తులు.. ఆ తర్వాత కూడా లడ్డూల కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసి మరీ లడ్డూలు కొంటుంటారు. అయితే లడ్డూల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పా్ట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల డయల్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే లడ్డూల విషయాన్ని ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లో ఎదురౌతున్న సమస్యను ఫోన్ కాల్ ద్వారా టీటీడీ ఈవో దృష్టికి తెచ్చారు. శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ.. లడ్డూప్రసాదం జారీలో ఆలస్యం అవుతోందని ఈవో దృష్టికి తెచ్చారు. లడ్డూ ప్రసాదం కాంప్లె్క్స్‌లోని ఉద్యోగులకు షిప్టులవారీగా విధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో షిఫ్టుల మార్పుల కారణంగా లడ్డూల జారీలో ఆలస్యం అవుతోందని.. త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో భక్తుడి ఫిర్యాదు మీద ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు. అయితే వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా మరో 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదనపు కౌంటర్ల ఏర్పాటు ద్వారా లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లో క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.