Andhrapradesh
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. జూన్ 30 వరకు ఈ దర్శనాలు రద్దు, ఆ మూడు రోజుల్లో!
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. గత వారం రోజులుగా కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికలు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారాలు) సామాన్య భక్తుల రద్దీ కారణంగా.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ కోరుతోంది. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.