International

‘ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది- సామాన్యులకు హాని జరగకూడదు’ ఇజ్రాయెల్​పై అమెరికా ఫైర్! – Israel Hamas War

Published

on

US On Rafah Attack : రఫాలో ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని తెలిపింది. సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని ఇజ్రాయెల్​ను అమెరికా కోరింది.

‘రఫాలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన దృశ్యాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ దృశ్యాలను చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. అవి చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్‌తో జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దు. అయితే హమాస్‌కు బుద్ధి చెప్పడం కోసం దాడి చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ, అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టకుండా ఉండాలి. అందుకోసం ఇజ్రాయెల్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్‌ పెద్ద నాయకులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని శ్వేతసౌధంలోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ అన్నారు.

‘ఇజ్రాయెల్ విషయంలో ఎలాంటి మార్పు లేదు’
అయితే రఫాలో భూతల దాడులు అవసరం లేదని తాము భావిస్తున్నట్లు జాన్ కిర్బీ వెల్లడించారు. దీనిపై ఇజ్రాయెల్​తో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఉన్నారు. అలానే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్‌ దాడి తర్వాత కూడా ఆ దేశం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధానంలో ఎలాంటి మార్పు లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ విషయంలో అమెరికా నిర్దేశించుకున్న హద్దులు ఇంకా ఆ దేశం మీరలేదనే విషయం వెల్లడవుతోందని నిపుణులు విశ్లేషించారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. అయితే దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ దాడుల్లో సోమవారం రాత్రి, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందడం గమనార్హం.

స్వతంత్ర దేశంగా పాలస్తీనా
మరోవైపు గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version