International

యుద్ధం తక్షణమే ఆపేస్తాం- కానీ ఆ కండిషన్స్​కు ఓకే అంటేనే!: పుతిన్ – Putin conditions to end Ukraine war

Published

on

Ukraine Russia War : ఉక్రెయిన్​తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ దేశంతో సంధికి సిద్ధమేనంటూ శుక్రవారం ప్రకటించారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని కండీషన్స్ పెట్టారు. వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని తెలిపారు.

అయితే పుతిన్‌ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ ఉక్రెయిన్‌ స్పందించింది. అకారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టీన్‌ పేర్కొన్నారు. ‘ఇది శాంతి ప్రతిపాదన కాదు తీవ్ర దాడికి, మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉంది’ అని నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ విమర్శించారు.

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే విషయమై ప్రపంచ దేశాల నేతలతో శని, ఆదివారాల్లో స్విట్జర్లాండ్‌ భేటీ నిర్వహించబోతోంది. ఇదిలా ఉండగా ఇటలీలో జరుగుతున్న జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది. దీనికి తోడు అమెరికా-ఉక్రెయిన్‌ల మధ్య పదేళ్ల పాటు అమలులో ఉండేలా రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంధి ప్రతిపాదన చేయడం గమనార్హం.

మరోవైపు, స్విట్జర్లాండ్‌లో జరిగే శాంతి సదస్సుకు హాజరయ్యేందుకు రష్యా నిరాకరించింది. ఉక్రెయిన్‌ సమస్యను పక్కదారి పట్టించే యత్నంగా దానిని పుతిన్‌ అభివర్ణించారు. అమెరికా-ఉక్రెయిన్‌ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని కూడా తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌తో తుది పరిష్కారం కోసం సంధి ప్రతిపాదన తెచ్చామని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని శుక్రవారం మాస్కోలోని విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంలో మాట్లాడుతూ పుతిన్‌ పేర్కొన్నారు. ‘నా ప్రతిపాదనను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే జరుగుతున్న రక్తపాతానికి రాజకీయ, నైతిక బాధ్యత వాటిదే’నని వార్నింగ్ ఇచ్చారు.

పుతిన్‌ చేసిన మరిన్ని డిమాండ్లివే
‘రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ గుర్తించాలి. అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్‌ కొనసాగాలి. సైనిక బలాన్ని పరిమితం చేసుకోవాలి. ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి’ అని పుతిన్‌ డిమాండ్‌ చేశారు. రెండేళ్లకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఖండించాయి.

Advertisement

పుతిన్ కండిషన్స్​కు ఉక్రెయిన్‌ నో
రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండడం వల్ల దానిని దెబ్బతీయాలనే మోసపూరిత కుట్రలో భాగంగానే పుతిన్‌ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్‌కు లేదని, ఆయన డిమాండ్లలో కొత్తవేమీ లేవని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖెలో పొదొల్యాక్‌ అన్నారు. శాంతి ప్రతిపాదన కొనసాగుతున్న వేళ 87 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ దళాలు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version