Telangana
TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్ 17
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ గురువారం (జూన్ 13న) విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. ఆన్సర్ కీతోపాటు తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా నేడు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు జూన్ 17వరకు అవకాశం ఉంటుంది. కీపై అభ్యంతరాలు జూన్ 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫైనల్ కీని తయారు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
కాగా మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో జరిగింది. అయితే వీరిలో 3.02 లక్షల మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్షమంది పరీక్షకు హాజరవలేదు. ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన అనంతరం మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు 28,150 మందిని ఎంపిక చేయనున్నట్లు ఇప్పటికే కమిషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.