Cricket

టీమ్‌ ఇండియా కోచ్‌గా ధోనీ? బీసీసీఐకి కోహ్లీ చిన్ననాటి కోచ్‌ ప్రపోజల్‌ – Team India Head Coach

Published

on

Dhoni Team India Head Coach : టీమ్‌ ఇండియా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు మే 27తో ముగిసింది. అయితే ఎవరెవరు అప్లై చేసుకున్నారనే అంశంపై బీసీసీఐ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా భారతీయ కోచ్‌ కోసం వెతుకుతున్నామంటూ వెల్లడించారు. అంతే కాకుండా ఆస్ట్రేలియా కోచ్‌లను సంప్రదించినట్లు వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తి చూపకపోవడం వల్ల, ఇక గంభీర్‌కే ఛాన్స్‌ ఉందని భావించారు. కానీ తాజాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంఎస్ ధోనీ పేరును సూచించారు.

“మొదట, ఈ పోస్ట్‌కు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. కోచ్‌గా ఎవరు వచ్చినా భారతీయుడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే, అతను గుడ్‌ ఆప్షన్‌ అవుతాడు. ధోని ఎక్కువ కాలం క్రికెట్ ఆడాడు, పెద్ద టోర్నమెంట్‌లు గెలుచుకున్నాడు” అంటూ రాజ్​ కుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రేసులో మోదీ, అమిత్​ షా!
బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు ముగిసే సమయానికి దాదాపు 3 వేల దరఖాస్తులు అందాయని తెలిసింది. అయితే వీటిలో భారీ సంఖ్యలో నరేంద్ర మోదీ, అమిత్‌ షా, సచిన్‌ తెందూల్కర్‌, ఎంఎస్‌ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్లతో నకిలీలు కూడా వచ్చాయట. దీంతో బీసీసీఐ ఇప్పుడు ఆ ఫేక్ అప్లికేషన్ల పని పట్టేందుకు ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. కొత్త కోచ్‌ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు ఉంటుంది. అయితే ఈ కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపించగా మరోసారి ఇండియన్ ప్లేయరే ఉంటాడా? లేదా విదేశీ కోచ్‌వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version