National

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

Published

on

Draupadi Murmu Teaching: దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థుల పేర్లు అడిగిన రాష్ట్రపతి వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ముర్ము అన్నారు.

అనంతరం గ్లోబల్‌ వార్మింగ్‌పై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ (అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి)’ గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25న ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు కూడా ద్రౌపది ముర్ము కావడం విశేషం. రాష్ట్రపతిగా ఆమె ప్రమాణస్వీకారం చేసే నాటికి ముర్ము వయసు 64 సంవత్సరాలు. కాగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె ఝార్ఖండ్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. అంతకుముందు ఆమె 1994- 97 మధ్య రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీఅరబిందో ఇంటిగ్రెల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌గా వ్యవహరించారు.

రాష్ట్రపతి భవన్​లో కొత్త పేర్లు
దిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రెండు హాల్స్‌ పేర్లు మారాయి. భవన్​లో దర్బార్ హాల్‌, అశోక్‌ హాల్‌ను ఇకనుంచి కొత్త పేర్లతో పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ వెల్లడించింది. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్​ను గణతంత్ర మండపం, అశోక్‌ హాల్‌ను అశోక్‌ మండపంగా పిలవనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version