Andhrapradesh
TDP MP Candidates : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు.. 11 నియోజకవర్గాల అభ్యర్థులు వీరే?
TDP MPs list : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం కొంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. షెడ్యూల్ విడుదల కావడంతో మిగిలిన ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో పదకొండు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ముందే 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారని, వారి పేర్లను ఇవాళ సాయంత్రం లేదా, బుధవారం వెల్లడించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఆరు ఎంపీ స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కేటాయించిన ఎంపీ నియోజకవర్గాల్లో కొన్నింటిని మార్పులు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ఎంపీ సీట్లను చంద్రబాబు పెండింగ్ పెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా..
టీడీపీ అధిష్టానం 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. వాటిలో కిందిపేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చివరిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మినహా వీటినే ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
విశాఖ పట్టణం – ఎం. భరత్
అమలాపురం – గంటి హరీశ్
విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయులు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్
అనంతపురం – బి.కె. పార్థసారథి
నంద్యాల – బైరెడ్డి శబరి