Andhrapradesh
TDP BJP JSP Alliance: ఎట్టకేలకు సర్దుబాటు.. సుదీర్ఘ కసరత్తు తర్వాత మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం…
TDP BJP JSP Alliance: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటులో బీజేపీ పైచేయి సాధించగలిగింది. ఏపీలో సొంతంగా గణనీయమైన స్థాయిలో లోక్‌సభ స్థానాలను గెలవాలని భావిస్తున్న ఆ పార్టీ అందుకు తగ్గట్టుగా సీట్లు దక్కించుకుంది.
మొత్తం 31 అసెంబ్లీ స్థానాలతో పాటు, 8 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. పొత్తులో భాగంగా మూడు పార్టీల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో గత వారం రోజులుగా ఢిల్లీ, విజయవాడ, ఉండవల్ల కేంద్రంగా సాగుతున్న పొత్తుల వ్యవహారానికి ముగింపు లభించింది. చంద్రబాబు Chandra babu నివాసంలో జరిగిన చర్చల్లో సోమవారం రాత్రి సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.
ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. తొలుత టీడీపీ-జనసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటులో జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. తాజా చర్చల్లో ఆ పార్టీ పోటీ చేసే స్థానాలను తగ్గించుకోడానికి సిద్ధపడింది. మూడు పార్లమెంటు స్థానాల్లో ఓ స్థానాన్ని కూడా ఆ పార్టీ త్యాగం చేసింది. తమ కోటా నుంచి బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాన్ని వదులుకునేందుకు జనసేన సిద్ధ పడింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయి. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని ప్రగాఢ ఆకాంక్షగా పేర్కొన్నారు. .
ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సాగిన సమావేశాలతో పొత్తు ఖరారైందని, ఈ క్రమంలోనే సోమవారం అమరావతిలో మూడు పార్టీలు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించినట్టు ఆ పార్టీ పేర్కొంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమిలోని భాగస్వాములు ఉంటారని సీట్లు పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని వెల్లడించారు.
ఈ స్థానాలకు సంబంధించిన సీట్లను వివరాలను పార్టీలు ప్రకటిస్తాయని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని జనసేన ప్రకటించింది. ఎన్.డి.ఏ. భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామని ఆ పార్టీ పేర్కొంది.
సుదీర్ఘ చర్చలు…
తొలుత జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరిగింది. తమ కోటాలో నుంచి బీజేపీకి జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వగా.. అదనంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం ఇచ్చింది.
తాజా భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో రాజకీయ వ్యూహం, ఈ నెల 17న తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణపై సోమవారం ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఏ విధంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తుందనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.
పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటున్న తీరు, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపైనా చర్చల్లో ప్రస్తావన వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ
చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు. ఈ నెల 15,17 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిలకలూరి పేట సభకు కూటమి తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు జనసేన పోటీ చేసే ఏడు అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించింది. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మిగిలిన 24 స్థానాల్లో జనసేన, భాజపాలు ఎవరెక్కడ పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది.
బీజేపీ మంగళవారం ప్రకటించనున్న లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.