Business

Tata Nexon CNG: టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..

Published

on

ప్రముఖ కంపెనీ టాటా నుంచి విడుదలైన ఎస్‌యూవీలలో నెక్సాన్ ఒకటి. ఈ కారుకు మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. అమ్మకాలలో కూడా ముందుకు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ కారును సీఎన్ జీ వెర్షన్ లో తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం మార్కెట్ ను ఊపేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ విడుదలకు కొన్నినెలల సమయం పడుతుంది. మారుతీ బ్రెజ్జాతో ఈ టాటా కారు పోటీపడుతుందని భావిస్తున్నారు.

త్వరలో విడుదల ..
2024లో కారును విడుదల చేయడానికి టాటా మోటార్స్ పనిచేస్తోంది. ఇప్పటికే హ్యారియర్, సఫారీ ఎస్ యూవీల కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను మార్కెట్ కు పరిచయం చేసింది. ఇక నెక్సాన్ సీఎన్ జీ వెర్షన్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల ఈ కారును అనేక సార్లు పరీక్షించారు. గత సంవత్సరం జరిగిన ఆటో ఎక్స్‌పో మోటార్ షోలో కూడా ప్రదర్శించారు. దీంతో నెక్సాన్ త్వరలోనే విడుదల కానుందని భావిస్తున్నారు. రాబోయే నెలల్లో తేదీ నిర్ణయించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 5 స్టార్ జీఎన్ సీఏపీ రేటెడ్ నెక్సాన్ కారు భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4 మీటర్ ఎస్ యూవీగా చెప్పవచ్చు. హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకి బ్రెజ్జా వంటి కార్లకు పోటీగా ఉంది.

టాటా నెక్సాన్ సీఎన్ జీ ధర..
ప్రస్తుతం నెక్సాన్ కారును వివిధ ఇంధన రకాలు, ప్రసార ఎంపికలలో విక్రయిస్తున్నారు. దీనిలో 6-స్పీడ్ ఎంటీ, 7 స్పీడ్ డీసీఏ, 6 స్పీడ్ ఏఎమ్టీ, 5 స్పీడ్ ఎంటీ వరకూ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే పెట్రోలు, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్ లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు ధర (ఐసీఈ) రూ. 8.14 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.15.80 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. అలాగే సీఎన్ జీ కారు 9.50 లక్షల నుంచి 10.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫీచర్లు..
టాటా నెక్సాన్ అంతర్గత లేఅవుట్ స్థిరంగా ఉంటుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రెండు స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఇల్యూమినేటెడ్ టాటా లోగో, ఏసీ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ వంటివి ఉంటాయని భావిస్తున్నారు. నెక్సాన్ సీఎన్ జీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వెర్షన్ లో నెక్సాన్ 118 హెచ్పీ శక్తిని, 170 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అయితే సీఎన్జీ వెర్షన్ లో అవుట్‌పుట్ కొద్దిగా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ట్విన్ సిలిండర్ సీఎన్ జీ ట్యాంక్‌తో కూడా వస్తుంది.

సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్..
ఇటీవల దేశంలో సీఎన్ జీ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఆటో మొబైల్ సంస్థలు ఆ వాహనాలపై ఫోకస్ చేశాయి. ఈ విషయంతో టాటామోటార్స్ ముందంజలో నిలుస్తుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version