International
సునీతా విలియమ్స్‌ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసాకు 19 రోజులు మాత్రమే గడువు ఉందా..? ఎందుకంటే..
Sunita Williams and Butch Wilmore : ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను పది రోజుల మిషన్ లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోంది. నాసా టీం భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్ కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. అయితే, వారు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు నాసాకు 19రోజులు గడువు మాత్రమే ఉంది.
అంతరిక్ష నౌకలోని థ్రస్టర్‌ల, హీలియం వ్యవస్థలు భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించడానికి కీలకం. ఏదైనాలోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఐఎస్ఎస్ వద్ద డాకింగ్ పోర్ట్ లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఎందుకంటే.. రాబోయే క్రూ-9 మిషన్ కు అనుగుణంగా డాకింగ్ పోర్ట్ వద్ద స్టార్‌లైనర్‌ను అన్‌డాక్ చేయాలి. క్రూ-9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ చేశారు. ఈ క్రూ-9 మిషన్ నలుగురు సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) తీసుకెళ్తుంది.
ముగ్గురు నాసా వ్యోమగాములు – జెనా కార్డ్‌మన్ , నిక్ హేగ్ మరియు స్టెఫానీ విల్సన్, ఒక రోస్కోస్మోస్ వ్యోమగామి, అలెగ్జాండర్ గోర్బునోవ్ క్రూ-9 మిషన్ లో ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. క్రూ-9 మిషన్ ప్రయోగంతో .. ప్రస్తుతం స్టార్ లైనర్ ఆక్రమించిన డాకింగ్ పోర్ట్ ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ లైనర్ పనికిరాకుండా పోయినట్లయితే.. విలియమ్స్, విల్మోర్ లను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పద్దతులను నాసా కనుగోవాల్సి ఉంటుంది. ఇందులో స్పేస్ ఎక్స్ డ్రాగన్, క్యాప్సూల్ ను ఉపయోగించుకోవచ్చు.
విలియమ్స్, విల్మోర్‌లను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా చేసిన ప్రయత్నాలు మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సంక్లిష్టతలు, ప్రమాదాలను ఎత్తిచూపుతున్నాయి. బోయింగ్, స్పేస్‌ఎక్స్‌తో ఏజెన్సీ సహకారం అంతరిక్ష నౌక ప్రాముఖ్యతను, సాంకేతిక వైఫల్యాల సందర్భంలో ఆకస్మిక ప్రణాళికల అవసరాన్ని నొక్కి చెబుతుంది. 19 రోజుల్లో గడువు సమీపిస్తున్నందున, ఈ క్లిష్టమైన మిషన్‌కు విజయవంతమైన పరిష్కారంకోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.