Business

Success Story: ఒకప్పుడు వెయ్యి నెలజీతంతో పాట్లు.. రూ.5,000 కోట్ల కంపెనీకి యజమాని..

Published

on

Virani Brothers: సక్సెస్ సాధించటం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు. దేశంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా నిలిచే స్థాయికి తన కలలను నిర్మించటం అని కొందరి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్నాక్ వ్యాపారంలో దిగ్గజ కంపెనీని నిర్మించిన విరానీ సోదరుల గురించే. ఒకప్పుడు వందల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన వీరు ప్రస్తుతం అత్యంత ప్రజాధరణ పొందిన బాలాజీ వేఫర్స్ సంస్థను స్థాపించటంతో పాటు విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. సందుభాయ్ విరానీ 1974లో తన సోదరుడితో కలిసి ఉద్యోగం కోసం రాజ్‌కోట్‌కు వచ్చారు. ఆ సమయంలో వారు సినిమా థియేటర్లలో స్నాక్స్ అమ్మే పనిలో చేరారు. అప్పుడు వారి నెల జీతం రూ.1000. సవాళ్ల ప్రయాణం తర్వాత రిస్క్ తీసుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా వారు అడుగులువేశారు.

తాము సినిమా హాళ్లలో విక్రయించిన పొటాటో చిప్స్ భారీగా ప్రజాధరణ పొందటంతో దానిని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్న ప్రయత్నం నేడు విరానీ సోదరులను దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారీ కంపెనీ నిర్మాణం దాకా నడిపించింది. తొలుత చిన్న స్థాయిలో చిప్స్ తయారీ చేసిన వీరు చుట్టుపక్కల దుకాణాల్లో వాటిని విక్రయించారు. అలా తర్వాతి కాలంలో 1982లో రూ.1.5 లక్షల రుణం తీసుకుని బంగాళదుంప చిప్స్‌ తయారీకి తొలిసారిగా ఫ్యాక్టరీని స్థాపించారు. అయితే ఆ రోజుల్లో ఇంత భారీ పెట్టుబడితో ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. అలా 1992లో సోదరులు కలిసి బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక కంపెనీని స్థాపించారు.

బాలాజీ వేఫర్స్ దేశంలో మూడవ అతిపెద్ద స్నాక్ తయారీ కంపెనీ. భారతీయ స్నాక్స్ మార్కెట్‌లో కంపెనీకి ఏకంగా 12% మార్కెట్ వాటా ఉంది. ఒకానొక సమయంలో దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్నాక్స్ తయారీదారు లేస్ తయారీ సంస్థ పెప్సికో కొనుగోలుకు ప్రయత్నాలు సైతం చేసింది. గడచిన ఏడాది కంపెనీ ఆదాయం రూ.5,000 కోట్ల మార్కుకు చేరుకుంది. ప్రస్తుతం 7000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ గంటకు 3,400 కిలోగ్రాముల చిప్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో 65 కంటే ఎక్కువ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. కంపెనీకి ఉన్న అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, నాణ్యమైన ఉత్పత్తి కారణంగా దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version