International

అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్‌- హగ్​ చేసుకుని ఫుల్ ఖుషీ- వీడియో చూశారా? – Sunita Williams Space Trip

Published

on

Sunita Williams Space Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంటకొట్టి వారిని ఆహ్వానించారు.

సునీత డ్యాన్స్ సూపర్!
ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సునీత డ్యాన్స్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. సునీత చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు.


గంట ఆలస్యమైనప్పటికీ!
అయితే బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్‌ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.

గణేశుడి విగ్రహాన్ని!
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version