Weather

Southwest Monsoon: శుభవార్త చెప్పిన ఐఎండీ.. మరో నాలుగు రోజుల్లో అండమాన్‌లోకి రుతుపవనాలు

Published

on

దేశంలోని రైతాంగానికి భారత వాతావరణ విభాగం (IMD) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) సమయానికి ముందే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా వారం, పది రోజుల్లో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ, ఈసారి మూడు రోజులు ముందే.. మే 19 నాటికి చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.

జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని నిపుణులు చెబుతున్నారు. అయితే రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకాలంటే అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలించాలి. ఒకవేళ, అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే నైరుతి రాకను జాప్యం తప్పదు.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణులు… మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్‌‌లోకి ప్రవేశించాయి. కానీ అరేబియా సముద్రంలో తుఫాను, ప్రతికూల పరిస్థితుల వల్ల జూన్‌ 8న కేరళలోకి ప్రవేశించాయి.

ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం కురిపిస్తాయని ఏప్రిల్ 15 నాటి ముందస్తు అంచనాల్లో ఐఎండీ తెలిపింది. వర్షపాతం 106 శాతం మేర ఉంటుందని, ఒకవేళ అంచనా తగ్గినా 101 శాతం పక్కా అని అంచనా వేసింది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వర్షపాతంపై ఈ అంచనాలను మే చివరి వారంలో మళ్లీ సవరించనుంది.

1971-2020 మధ్య కాలానికి సగటు వర్షపాతం 87 సెం.మీ. గతేడాది మాత్రం సాధారణం కంటే (94.4%) వర్షపాతం నమోదయ్యింది. అయితే, IMD గతేడాది 96%గా ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు 2022లో సాధారణం కంటే ఎక్కువ 106%, 2021లో 99% ‘సాధారణ’ వర్షపాతం నమోదయ్యింది. అయితే, 2020లో 109% ‘సాధారణం కంటే ఎక్కువ’వర్షపాతం కురిసింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version