International

సారీ చెప్పిన బైడెన్​- తొలిసారి బహిరంగ క్షమాపణలు- కారణమిదే – Joe Biden apologises to Zelenskiy

Published

on

Joe Biden apologises to Zelenskiy : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మొదటిసారిగా ఉక్రెయిన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించడంలో నెలకొన్న జాప్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. డీ-డే 80వ వార్షికోత్సవ వేడుకలకు పారిస్‌ వెళ్లిన బైడెన్‌, ఉక్రెయిన్‌కు క్షమాపణలు చెప్పారు. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. నాజీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని, ప్రస్తుత రష్యా దురాక్రమణతో పోల్చారు బైడెన్‌. 61 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ కాంగ్రెస్‌లో ఆరు నెలల పాటు ఆగిపోయినందుకు తాను నిరాశ చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రష్యా దాడులు కొనసాగగా, ఉక్రెయిన్‌ సాయం కోసం ఎదురు చూసింది.

అమెరికాకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంలో అమెరికా ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. సైనిక సాయాన్ని ఆమోదించినందుకు అమెరికా చట్టసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం ఇటీవల రష్యా దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్‌కు ఉపయోగపడిందని తెలిపారు. ఉక్రెయిన్ ప్రస్తుత పోరాటాన్ని, రెండో ప్రపంచ యుద్ధంలో ఐరోపాను రక్షించడానికి అమెరికా చేసిన ప్రయత్నాలతో పోల్చారు.

ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌ సపోర్ట్‌
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఫ్రెంచ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘రెండో ప్రపంచ యుద్ధం, ఉక్రెయిన్ పోరాటానికి మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు. ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం ఉక్రెయిన్‌కు మిరాజ్ యుద్ధ విమానాలను అందిస్తామని ప్రకటించారు.

డీ-డే వార్షికోత్సవం అంటే ఏంటి?
రెండో ప్రపంచ యుద్ధంలో 1944 జూన్ 6న ఫ్రాన్స్‌లోని నార్మాండీపై మిత్రరాజ్యాలు దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌ పేరు డీ-డే. ఇది యుద్ధంలో కీలక మలుపు. నాజీ-ఆక్రమిత ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా అమెరికన్, బ్రిటీష్, కెనడియన్, ఇతర మిత్రరాజ్యాల దళాలు భారీ దాడులకు పాల్పడ్డాయి. పశ్చిమ ఐరోపాను నాజీ నియంత్రణ నుంచి విడిపించే లక్ష్యంతో దాడులు జరిగాయి. దీనిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, డీ డే వార్షికోత్సవం వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా నార్మాండీలో ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులకు నివాళులర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version