Telangana

త్వరలో తెలంగాణ ఉద్యోగులకు డిఏ

Published

on

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ లభించనుంది. జూన్‌ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంవో కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో డీఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై తర్వాత మరో డీఏ కూడా కలిస్తే ఐదవుతాయి. అయితే, ప్రభుత్వం తొలుత ఒక డీఏ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిందని శ్రీనివాసరావు తెలియజేశారు. ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలను పరిశీలించి.. ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్థిక పరమైన అంశాల్లో పెండింగ్‌ డీఏలు, హెచ్‌ఆర్‌ఏ పెంపు, ఐఆర్‌, సప్లమెంటరీ బిల్స్‌పై అన్నీ ఒకేసారి కాకున్నా దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.
సాధారణ బదిలీలు, మెడికల్‌ బిల్లులు, ఇతర సర్వీసు సంబంధిత అంశాలను పరిష్కరిస్తామని తెలిపిందన్నారు. పీఆర్‌సీ నివేదిక ఇవ్వడంలో జాప్యం జరిగితే ఐఆర్‌ పెంచాలని ప్రభుత్వాన్ని తాము కోరామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో బుధవారం ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో టీజీవో ప్రతినిధులు సీఎస్‌ శాంత కుమారిని కలిసి 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రతి డిమాండ్‌కు సంబంధించి డిటైల్డ్‌ నోట్‌ కూడా సమర్పించారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎస్‌ అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. ఉద్యోగుల వినతులను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిని ఆదేశించారు. గురువారం టీజీవో నాయకులతో చర్చించిన వేం నరేందర్‌.. రుణమాఫీ తదితర కార్యక్రమాలు ఉన్నందున ప్రస్తుతానికి ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో టీజీవో నేతలు శుక్రవారం సీఎంవో కార్యదర్శి శేషాద్రితో సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version