Business
Sony Pictures Deal : భారత్‌లో ఏడేళ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ నెట్‌వర్క్!
Sony Pictures Deal : న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్‌లో ప్రసారం చేయడానికి సోనీ పిక్చర్స్ నెట్క్ వర్క్ ఇండియా (SPNI) టెలివిజన్, డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. 2024, మే 1వ తేదీ నుంచి 2031 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
2026-27, 2030-31 వేసవిలో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటనలతో పాటు న్యూజిలాండ్‌లో జరిగే ఇతర ద్వైపాక్షిక టెస్టులు, వన్డేలు, అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ సోనీ పిక్చర్స్ నెట్క్ వర్క్ ఇండియా స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి. సోనీ లివ్ (Sony LIV) యాప్‌లోలైవ్ స్ట్రీమ్ కానుంది.
ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ), శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)తో ఒప్పందాలు ఉన్న ఎస్‌పీఎన్‌ఐ పోర్ట్‌ఫోలియోలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా చేరింది. న్యూజిలాండ్ క్రికెట్‌తో తమ నూతన భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎన్‌పీ సింగ్ తెలిపారు.
‘అసాధారణమైన క్రీడా నైపుణ్యం, సత్తాకు న్యూజిలాండ్ జట్టు పెట్టింది పేరు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన క్రికెట్ జట్లలో ఇదొకటి. ఇలాంటి జట్టు మ్యాచ్‌లను భారత్‌లోని అభిమానులకు అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. ఎస్‌పీఎన్‌ఐ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, స్పోర్ట్స్ బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ న్యూజిలాండ్‌తో భాగస్వామ్యాన్ని స్వాగతించారు.
2031 సీజన్ వరకు కివీస్ మ్యాచ్‌లన్నీ చూడొచ్చు :
న్యూజిలాండ్ క్రికెట్ చైర్ డయానా పుకెటాపు లిండన్ మాట్లాడుతూ.. ఇది ఉత్తేజకరమైన సమయమన్నారు. పోర్ట్‌ఫోలియోలో ప్రపంచ స్థాయి క్రీడా టోర్నమెంట్‌లతో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా భారత్‌లో ప్రీమియర్ స్పోర్ట్స్ కంటెంట్ ప్రొవైడర్లలో ఒకటి. ఈ భాగస్వామ్యం కోసమ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. బ్లాక్‌క్యాప్స్ (న్యూజిలాండ్ పురుషుల జట్టు) గత కొన్ని ఏళ్లుగా గొప్ప విజయాన్ని అందుకుంటోంది. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. గత టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది. అద్భుతమైన ప్రదర్శనతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. భారత ఉపఖండంలోని క్రికెట్ అభిమానులు 2031 సీజన్ ముగిసే వరకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ తదితర జట్లతో న్యూజిలాండ్ మ్యాచ్‌లను చూడవచ్చు.
‘మా స్పోర్ట్స్ పోర్ట్ ఫోలియోలో బలమైన జట్లను చేర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. భారత్‌లోని ప్రేక్షకుల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో భాగస్వామ్యం స్పోర్ట్స్ పోర్ట్ ఫోలియోకు ఒక ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. బ్లాక్ క్యాప్స్ జట్టు అసమాన పోరాట, క్రీడా స్ఫూర్తితో క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఏడేళ్ల భాగస్వామ్యంతో అద్భుతమైన క్రికెట్‌ను అభిమానులకు అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
భారత జట్టుతో రెండు ద్వైపాక్షిక సిరీస్‌లు
ఇందులో 2024-25లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్‌లతో 3 కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. 2026-27, 2030–31లో భారత పురుషుల క్రికెట్ జట్టుతో వరుసగా రెండు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ సంతోషం వ్యక్తం చేశారు. ‘సోనీ పిక్చర్స్ నెట్క్‌వర్క్ ఇండియా దూరదృష్టి ఉన్నవ్యాపార సంస్థ. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారత్ కీలకమైన మార్కెట్ అన్నారు. ఎస్‌పీఎన్‌ఐతో భాగస్వామ్యం ఇరు కంపెనీల సంయుక్త నిర్ణయమేమని ఎన్‌జేడ్‌సీ కమర్షియల్ జీఎం క్రిస్ స్మిత్ అన్నారు.
ఇది ముఖ్యమైన వాణిజ్య ఒప్పందంగా ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సోనీ పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఈ డీల్‌లో సోనీ బృందంతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఎన్‌జెడ్‌సీ కమర్షియల్ జీఎం క్రిస్ స్మిత్ చెప్పుకొచ్చారు. భారత్‌లో ఎస్‌పీఎన్‌ఐ డిజిటల్ హక్కులు 2024-25, 2025-26 సీజన్‌లలో అమెజాన్ ప్రైమ్‌తో సహ-ప్రత్యేకంగా ఉండనున్నాయి.