Andhrapradesh
శివ సినిమాను తలపించే ఘటన.. కత్తులు, బీరు సీసాలతో నిండు గర్భిణీ పై దాడి..
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్ఎంపీ బాలు గ్యాంగ్ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తనకు అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తూ పోలీస్ రికార్డుల్లోకి ఎక్కేస్తున్నాడు. గతంలో ఆర్ఎంపీ బాలుపై నాలుగు కేసులు నమోదయ్యాయి. తనకు వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాదిపై రక్తం వచ్చేలా దాడి చేసిన సంఘటన మరువక ముందుకే.. శుక్రవారం రాత్రి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మంజీరాబాదులో తాగిన మైకంలో బారులోని వస్తువులను ధ్వంసం చేస్తుండగా అక్కడ ఉన్న సిబ్బంది ప్రభాకర్ అడ్డుకున్నారు. ఆగ్రహంతో సిబ్బందిపై దాడి చేశాడు బాలు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బార్‌లోని అద్దాలు ధ్వంసం చేసే సమయంలో ఆర్ఎంపీ బాలు చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించి ఇంటికి పంపించేశారు.
ఉదయం 7 గంటల సమయంలో బాలు తన అనుచరులతో ప్రభాకర్ తమ్ముని ఇంటిపైకి కత్తులు, ఇనప రాడ్లు, బీరు సీసాలతో వెళ్లి విజయ్‌పై దాడి చేస్తుండగా భార్య అడ్డుపడింది. 8 నెలల గర్భిణీస్త్రీ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా తీవ్ర రక్త గాయాలు అయ్యేలా దాడి చేయడంతో స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ స్త్రీకి తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలు గ్యాంగ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆర్ఎంపీ బాలు అతని గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలు అతని గ్యాంగ్‌పై చర్యలు తీసుకొని పట్టణంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు.