National
Sikkim: వరుసగా 5 సార్లు గెలుపు.. 26 ఏళ్లపాటు సీఎం.. అయినా 2 సీట్లలో ఘోర పరాభవం
Sikkim: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. కానీ 4 రాష్ట్రాల అసెంబ్లీలలో భాగంగా 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (జూన్ 2) వెలువడనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల ఫలితాలు.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటే వెలువడనుండగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం ఆదివారం ఫలితాల వెల్లడి ఉంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌ను దాటి.. బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోగా.. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా-ఎస్‌కేఎమ్ పార్టీ విజయం దాదాపు ఖాయం అయింది. ఈ క్రమంలోనే సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్-ఎస్‌డీఎఫ్ పార్టీ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు.
32 సీట్లు ఉన్న సిక్కిం అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 17 కాగా అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా-ఎస్‌కేఎమ్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్‌డీఎఫ్ పార్టీ అధినేత, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి 73 ఏళ్ల పవన్ కుమార్ చామ్లింగ్.. నామ్చేబుంగ్, పోక్లాక్ కామ్రాంగ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. నామ్చేబుంగ్ సీటులో ఎస్‌కేఎం అభ్యర్థి రాజు బాన్సెట్ చేతిలో 2256 ఓట్లు, పోక్లాక్ కామ్రాంగ్ స్థానంలో ఎస్‌కేఎం పార్టీ అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో 3063 ఓట్లతో ఓడిపోయారు. ఎస్‌కేఎం పార్టీ 19 సీట్లలో గెలుపొందగా.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
2018 ఏప్రిల్ 29 వ తేదీన అప్పుడు సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్.. చరిత్ర సృష్టించారు. దేశంలోనే అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా రికార్డుల్లోకి ఎక్కారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, దివంగత నేత జ్యోతి బసును వెనక్కి నెట్టారు. 1994, 1999, 2004, 2009, 2014 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్.. తిరుగులేని విజయాలను సాధించగా.. ఆయన వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1985 నుంచి 2009 వరకు దామ్‌తాంగ్ నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ చామ్లింగ్ గెలుపొందారు. ఆ తర్వాత 2009 నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. తాజాగా రెండు స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలవలేకపోయారు.
32 ఏళ్లకే రాజకీయ జీవితం ప్రారంభించిన పవన్ కుమార్ చామ్లింగ్.. 1989 నుంచి 1992 వరకు సిక్కిం సంగ్రామ్ పరిషత్ ఆధ్వర్యంలోని నార్ బహదూర్ భంఢారీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1993 మార్చిలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా నేపాలీ భాషలో చామ్లింగ్ మంచి కవి, గీత రచయిత కావడం గమనార్హం.
1994 నుంచి 2019 వరకు గెలుస్తూ వచ్చిన ఎస్‌డీఎఫ్.. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లోనే సిక్కింలోని 32 స్థానాల్లో ఎస్‌కేఎమ్ పార్టీ 10 సీట్లు సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎస్‌కేఎం 17 సీట్లు సాధించి అధికారంలోకి రాగా.. ఎస్‌డీఎఫ్ 15 స్థానాలతో ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఫలితాలు ఎస్‌కేఎమ్‌కే అనుకూలంగా ఉన్నాయి.